Sep 15,2021 21:22

ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై యువకుడు చేతులు, కర్రలతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై బుధవారం ఎస్‌పి విజయరావు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

యువతిపై దాడి చేసిన యువకుడిని అదుపులోకి తీసుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. రాపూరు, కలువాయి, సోమశిల, రాయకోటయ్యనగర్‌ పరిసర ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. ఈ విచారణలో దాడికి పాల్పడిన రాపూరు మండలంకు చెందిన పల్లాల వెంకటేష్‌కి, బాధితురాలికి గత కొంత కాలంగా స్నేహసంబంధాలు ఉండేవని, యువకుడి ప్రవర్తన నచ్చకపోవడంతో మాట్లాడటం మానేసినట్లు గుర్తించారు. ఇది మనస్సులో పెట్టుకొన్న యువకుడు బాధితురాలి పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ మూడు నెలల క్రితం నగరానికి దూరంగా తీసుకెళ్లి ఈ తరహాలో దాడికి పాల్పడ్డాడు. తన స్నేహితుడి సహాయంతో చిత్రీకరించిన దృశ్యాలను ఇటీవల సోషల్‌ మీడియాలో ప్రసారం చేశారు. యువతిపై దాడికి పాల్పడటం, దృశ్యాలను చిత్రీకరించి, ప్రచారం చేసినందుకు వెంకటేష్‌ అనే యువకుడిపై రౌడీ షీట్‌ ఓపెన్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏడు రోజుల్లో కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలి వైపు నుంచి ఎవరూ ఫిర్యాదు చేయకపోయినప్పటికీ పోలీసు శాఖ కాగ్నిజన్స్‌ కేసుగా నమోదు చేసింది.