- కిమ్స్‌లో అరుదైన శస్త్ర చికిత్స
- ఆరోగ్యశ్రీ పథకంలో పూర్తి ఉచితం
- ఏపిలోనే మొదటి శస్త్రచికిత్స
ప్రజాశక్తి - కర్నూలు హాస్పిటల్: ఒక యువతి పొట్టలో ప్లీహానికి సమీపంలో దాదాపు పుచ్చకాయ పరిమాణంలో ఉన్న కణితిని కర్నూలు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా తొలగించి ప్రాణదానం చేశారు. ప్రపంచంలోనే అరుదుగా సంభవించే ఇలాంటి కణితులకు భారతదేశంలో రెండవది కాగా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొదటిది. ఈ శస్త్ర చికిత్స డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా చేయడం విశేషం. కర్నూలు కిమ్స్ ఆసుపత్రి కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్, బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ వసీమ్ హసన్ రజా షేక్ తెలిపిన వివరాల ప్రకారం.... కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ముల్లా గుల్జార్ (20) పుట్టుకతోనే జన్యుపరమైన కారణాల వల్ల ఈ కణితి ఏర్పడింది. గత ఆరు నెలలుగా ఆమె కడుపునొప్పితో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. కొందరు వైద్యులు ఆమెకు గ్యాస్ సంబంధిత సమస్యలని భావించి, అందుకు మందులు కూడా ఇచ్చారు. నొప్పి తగ్గకపోవడం, వాంతులు కూడా అవుతుండటంతో చివరకు కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. సిటీ స్కాన్ చేసి, ప్లీహం సమీపంలో పెద్ద కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స చేసి తొలగించడం తప్ప మరో మార్గం లేదు. అది చాలా సంక్లిష్టమైనది. లోపల కణితి పెరుగుతూ ఉండటంతో అది పేగులకు కూడా కొంతవరకు అతుక్కుని ఉంది. దాంతో అత్యంత జాగ్రత్తతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఈనెల 15న ఆమెకు ఆపరేషన్ చేసి, విజయవంతంగా కణితిని తొలగించారు. శస్త్రచికిత్స చేసిన వైద్య బందంలో కర్నూలు కిమ్స్ ఆసుపత్రి కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్, బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ వసీమ్ హసన్ రజా షేక్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, మత్తు వైద్య నిపుణురాలు డాక్టర్ శృతి ఉన్నారు.
వైద్యులు