Jan 15,2022 16:00

లఖ్‌నపూ: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై బిజెపి అధిష్టానం కసరత్తులు కొలిక్కి వస్తున్నాయి. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం తొలిజాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈసారి గోరఖ్‌పూర్‌ అర్భన్‌ స్థానం నుంచి బరిలో దిగనున్నారు. ఇక్కడ మార్చి 3న ఆరో దశలో పోలింగ్‌ జరగనుంది. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి ధర్మేంద్ర ప్రధాన్‌ సంబంధిత వివరాలు వెల్లడించారు. అధిష్టానం తుది నిర్ణయం మేరకు ఈ జాబితా విడుదల చేసినట్లు చెప్పారు. ఆదిత్యనాథ్‌ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. తొలుత అయోధ్య ,మధుర.. ఈ రెండింటిలో ఒక చోటనుంచి పోటీ చేస్తారని వార్తలు రాగా, తాజాగా గోరఖ్‌పూర్‌ అర్భన్‌ స్థానం ఖరారైంది. ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్‌ మౌర్య సిరాథూ నుంచి పోటీ చేయనున్నారు.
యూపీ ఎన్నికల్లో మొదటి, రెండు విడతల్లో పోటీ చేయనున్నవారి అభ్యర్థుల పేర్లు ఈ జాబితాలో పొందుపర్చారు. మొదటి విడతలో 58 సీట్లకుగానూ 57 మంది , రెండో విడతలో 55 స్థానాలకు గానూ 48 మంది పేర్లను ఇందులో ప్రకటించారు. ఈ జాబితాలో 63 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. యూపీలో ఫిబ్రవరి 10న మొదలు.. మార్చి 7 వరకు మొత్తం ఏడు దశల్లో పోలింగ్‌ జరుగనున్న విషయం తెలిసిందే.. ఇదిలా ఉండగా.. ఇలీవల బిజెపి రాష్ట్రప్రభుత్వం నంచి ముగ్గురు మంత్రులతో సహా 10మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఓబిసి నేతలు ధరమ్‌సింగ్‌ సైనీ, స్వామి ప్రసాద్‌ మౌర్యతో సహా పలువురు అఖిలేష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలోని సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.