
న్యూఢిల్లీ : ఫేస్బుక్ పేరుతో యువత మోసపోతున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉంటున్నాం. ఇటువంటి ఘటనల్లో ఎక్కువగా మహిళలే బాధితులవుతున్నారు. పేదరికాన్ని ఆసరాగా తీసుకుని ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఆశ చూపి, ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. యుపికి చెందిన ఒక మహిళపై ఇద్దరు రైల్వే సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. సెక్యూరిటీ కౌన్సిలర్, బోపాల్ డివిజన్ విపత్తు నిర్వహణ ఇన్చార్జ్ అయిన రాజేష్ తివారి, యుపిలోని మహోబాకు చెందిన మహిళ (22) ఫేస్బుక్ ద్వారా స్నేహితులయ్యారు. ఆమెకి ఉద్యోగం ఇప్పిస్తానని భోపాల్‌కు రావాలని తివారి తెలిపారు. దీంతో సదరు మహిళ ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో భోపాల్‌కు చేరుకుంది. భోపాల్ మెయిన్ స్టేషన్‌లోని పశ్చిమ సెంట్రల్ రైల్వేకు చెందిన ఒక భవనంలో మత్తు మందు ఇచ్చి ఆమెపై తివారి, మరో రైల్వే ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహలోకి వచ్చిన ఆమె రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, తివారిని అదుపులోకి తీసుకున్నామని, మరో ఉద్యోగి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.