Nov 14,2020 16:33

అత్యంత వేగంగా దూసుకుపోతున్న సోషల్‌ మీడియాలో టెలిగ్రామ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికే చాలా మంది యూజర్లు టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అంతేకాకుండా టెలిగ్రామ్‌ ద్వారా ఎక్కువ ఎంబి కలిగిన వీడియోలు, ఒకేసారి ఎన్నో ఫొటోలు సైతం షేర్‌ చేసుకునే అవకాశం ఉంది. మరే ఇతర సోషల్‌ మీడియా యాప్‌లలో ఈ అవకాశం లేదు. ఇప్పుడు అత్యంత వేగంగా విస్తరిస్తున్న టెక్నాలజీకి, యూజర్ల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త ఫీచర్లను టెలిగ్రామ్‌ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. బాగా పాపులర్‌ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్‌ మెసేజింగ్‌ యాప్‌లలో లేని కొన్ని ప్రత్యేక ఫీచర్స్‌ను టెలిగ్రామ్‌ అందిస్తుండటంతో ఈ యాప్‌కు అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. తాజాగా టెలిగ్రామ్‌ మల్టిపుల్‌ పిన్డ్‌ మెసేజెస్‌, లైవ్‌ లొకేషన్‌ నోటిఫికేషన్‌, మ్యూజిక్‌ ప్లేలిస్ట్‌ షేరింగ్‌ వంటి కొత్త ఫీచర్స్‌ను తీసుకొచ్చింది. మల్టిపుల్‌ పిన్డ్‌ మెసేజెస్‌ ఫీచర్‌తో గ్రూప్‌లో చాట్‌ చేస్తున్నప్పుడు రకరకాల మెసేజ్‌లను పేర్ల ఆధారంగా పిన్‌ చేసుకోవచ్చు. చాటింగ్‌ మధ్యలో వాటిని చూడాలనుకుంటే గ్రూపు పై భాగంలో కుడివైపున పిన్‌ సింబల్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే ప్రత్యేక మెసేజ్‌ పేజీలో పిన్‌ చేసిన మెసేజ్‌లు కనిపిస్తాయి.

ఇక గతంలో ఉన్న లైవ్‌ లొకేషన్‌ ఫీచర్‌ను మరింత మెరుగ్గా పనిచేసేలా మార్పులు చేశారు. ఇందులో మన స్నేహితులు, కుటుంబసభ్యులు ఎవరైనా తమ లొకేషన్‌ను షేర్‌ చేస్తే మనకు వెంటనే అలర్ట్‌ నోటిషికేషన్‌ వస్తుంది. అలానే వారు మన లొకేషన్‌కు దగ్గరగా వచ్చినప్పుడు నోటిపికేషన్‌తో మనల్ని అలర్ట్‌ చేస్తుంది. దానితో పాటు వారు ఏ దిశలో వస్తున్నారన్నదీ తెలుసుకోవచ్చు. ఇక మ్యూజిక్‌ షేరింగ్‌ విషయానికి వస్తే.. ఒకేసారి ఎక్కువ పాటలను టెలిగ్రామ్‌లో ఫార్వర్డ్‌ చేసుకోవచ్చు. అంతేకాదు ఇందులోని బిల్డ్‌ ఇన్‌ మీడియా ప్లేయర్‌ ఫీచర్‌ వాటిని వరుస క్రమంలో ఉంచి ఒకదాని తర్వాత ఒకటి వినేలా ప్లేలిస్ట్‌ను చూపిస్తుంది. దీంతో పాటలను సులభంగా వినొచ్చు. వాటిని ఇతరులకు ఫార్వర్డ్‌ చేయడంతో పాటు కామెంట్‌ చెయొచ్చు. ఇవే కాకుండా టెలిగ్రామ్‌లో ఉండే ఛానెల్స్‌ అడ్మిన్స్‌ సబ్‌స్క్రైబర్స్‌ యాక్టివిటీని ట్రాక్‌ చేయడంతో పాటు ఛానల్‌ స్టాటిస్టిక్స్‌ తెలుసుకునేలా కొత్త ఫీచర్‌ను పరిచయం చేశారు.