Jan 14,2021 08:23

యంత్రాంగం : సంక్రాంతి తొలిరోజున యద్దేచ్ఛగా కోడి పందేలు నిర్వహించారు. గుండాట, పేకాట, జూద క్రీడలు జోరుగా సాగాయి. తొలి రోజు కోట్లాది రూపాయలు చేతులు మారాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులే పందేలను ప్రారంభించడంతో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎప్పటిలానే ఈ ఏడాదీ కోడిపందేలు ప్రారంభమయ్యాయి. పేకాట, గుండాట ఇతర జూదాలు యద్దేచ్ఛగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో వైసిపి నేతలే నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. తొలిరోజు రూ.25 నుంచి రూ.30 కోట్లు చేతులు మారినట్టు సమాచారం. ఈ మూడు రోజులు రూ.100 నుంచి రూ.120 కోట్లు చేతులు మారనున్నాయి. పశ్చిమగోదావరిలో పెనుమంట్ర,ఏలూరు, జంగారెడ్డిగూడెం, తణుకు, భీమవరం చుట్టుపక్కల గ్రామాల్లో 200కు పైగా బరులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.టిడిపికి చెందిన ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు కాళ్ల మండలం సీసలి గ్రామంలో కోడిపందేలు ప్రారంభించారు. వైసిపి నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్‌ గోకరాజు పెదబుజ్జి సైతం కోడిపందేలను ప్రారంభించారు. పందేలకు అనధికార అనుమతివ్వడంతో బరుల ప్రాతిపదికన పోలీసులకు రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకూ మామూళ్లు ముట్టజెబుతున్నట్లు పందెంరాయుళ్లు చెబుతున్నారు.


గుంటూరు నగరం మండల కేంద్రంలో కోడి పందేలను పార్లమెంట్‌ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ప్రారంభించారు. భట్టిప్రోలు మండలం పల్లెకోన గ్రామంలో మాజీ ఎంపి మోదుగుల వేణుగోపాల రెడ్డి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పందేలను స్వయంగా వీక్షించారు. పెదకూరపాడు మండలం బలుసుపాడులో లోక్‌సభ సభ్యులు లావు కృష్ణదేవరాయలు, వి.బాలశౌరి, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కోళ్లను బరిలోకి వదిలి పోటీలను ప్రారంభించారు.


కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఎస్పీ, కలెక్టరేట్‌ కార్యాలయాలకు కూతవేటు దూరంలోని మేకవానిపాలెం శ్రీనివాసనగర్‌, రుద్రవరంలో కోడిపందెలు, జూదాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. చల్లపల్లి, గన్నవరం, చినపాండ్రాక, నూజివీడు, అవనిగడ్డ, మోపిదేవి, ఘంటసాల, నాగాయలంక, పెడన, గూడూరు, బంటుమిల్లి మండల్లాలో కోడి పందాలు, గుండాట, కోత ముక్క, కాయిరాజకాయ వంటి జూద ఆటలు జోరుగా సాగుతున్నాయి. పక్క జిల్లాల నుంచి పందెంరాయుళ్లు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పోటీలను ఎమ్మెల్యే టిజెఆర్‌ సుధాకర్‌ బాబు ప్రారంభించారు.