Nov 29,2020 22:26

అక్రమంగా వెలిసిన ఒక లే ఔట్‌

జిల్లాలో అక్రమ లే ఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వ అనుమతులు లేకున్నా ప్లాట్లలో స్థలాల అమ్మకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. పలు గ్రామ పంచాయతీల్లో 767 అనధికార లే ఔట్లు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. రాజకీయ నాయకుల అండదండలతో ఇవి విచ్చలవిడిగా వెలుస్తున్నా కొన్నిచోట్ల అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ నేతల సిఫార్సులతో కొందరు వ్యాపారులు ఇష్టారీతిన స్థలాల విక్రయాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాదాయానికి భారీగా గండి పడుతోంది.
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకు పరిమితమైన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కొంతకాలంగా గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. పట్టణాలకు సమీప గ్రామాల్లో పల్లె వాతావరణంతో పాటు, అన్ని రకాల వసతులు ఉండటంతో ఇళ్లు నిర్మించుకునేందుకు అక్కడ పలువురు స్థలాలను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్లాట్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా లే ఔట్లు సాగుతున్నప్పటికీ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలున్నాయి. ఫలితంగా రియల్‌ వ్యాపారులకు కాసులు కురుస్తుండగా ప్రభుత్వ ఆదాయానికి మాత్రం గండి పడుతుండడం శోచనీయం.
కానరాని అనుమతులు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవసాయ భూమిలో ప్లాట్లు వేసి విక్రయించాలంటే ముందుగా అనేక రకాల అనుమతులు తీసుకోవాలి. జిల్లాలో కొన్నేళ్లుగా సాగుతున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నారు. స్థానిక పంచాయతీ అధికారులకు లంచాలు ముట్టజెప్పి స్థలాల అమ్మకాలు సాగిస్తూ జేబులు నింపుకుంటున్నారు. జిల్లాలో అనేకచోట్ల ఇదే తంతు సాగుతోంది. జిల్లా ఉన్నతాధికారులు సైతం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
రాజకీయ నాయకుల ఒత్తిళ్లు
జిల్లాలో వెలుస్తున్న అక్రమ లే ఔట్లలో స్థలాల విక్రయాలు జరిగిపోతున్నాయి. అంతేకాక రాజకీ య నాయ కుల సిఫార్సులతో ఆ యా కాలనీల్లో స్థానిక అధికారులు అన్ని వసతులూ కల్పిస్తున్నారు. తద్వారా ప్రభుత్వం ఆదాయం కోల్పో తోంది. వాస్తవానికి అనుమతులు లేని లే ఔట్ల లో ఇంటి స్థలాలు కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో ఆయా పంచాయతీల ఆధ్వర్యంలో ఎటువంటి అభివద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉండదు. కనీసం విద్యుత్తు సౌకర్యం కూడా కల్పించకూడదు. పంచాయతీ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో గతేడాది డిసెంబరు 31 నాటికి 50 గ్రామ పంచాయతీల్లో 767 అక్రమ లే ఔట్లను పంచాయతీ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది 10 నెలల కాలంలో లెక్కల్లోకి రాని మరో 400 వరకు లే ఔట్లు ఉంటాయని సమాచారం. వాటిని గుర్తించి చర్యలు తీసుకోవడంలో పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి.
అనధికార లే ఔట్లలో కొన్ని...
జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమైన కాకినాడ రూరల్‌ రమణయ్యపేట గ్రామ పంచాయతీలో అత్యధికంగా 81 అక్రమ లే ఔట్లు చేసి విక్రయిస్తున్నారు. అయినా చర్యలు లేవు. ఇదే మండలం తిమ్మాపురంలో 55 లే ఔట్లు ఉన్నాయి. పెద్దాపురం మండలం ఎస్‌.అన్నవరంలో 64, రాజమహేంద్రవరం రూరల్‌ పిడింగొయ్యిలో 63, బొమ్మూరులో 61, దివాన్‌ చెరువులో 38, చక్రద్వారబంధంలో 33, కోలమూరులో 32, హుకుంపేటలో 25, పాలచర్లలో 21, రాజానగరంలో 20 లే ఔట్లు వెలిశాయి.