
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి: స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎపి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ గతంలో అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై శాసన మండలి సవరణలు ప్రతిపాదించి తిప్పిపంపగా వాటిని సోమవారం శాసనసభ తోసిపుచ్చింది. ఇంతకుముందు ఆమోదించిన బిల్లును యథాతథంగా ఆమోదించింది. అందుకు నిరసనగా ప్రతిపక్ష టిడిపి సభ నుంచి వాకౌట్ చేసింది. స్థానిక ఎన్నికల్లో మద్యం, డబ్బు వంటి ప్రలోభాలను కట్టడి చేసేందుకంటూ సర్కారు గత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రతిపాదించింది. ఎన్నికలయ్యాక, అభ్యర్ధులు గెలిచాక కూడా ప్రలోభాలపై ఫిర్యాదులస్తే కేసులు నమోదు చేయవచ్చు. విచారణలో నేరం రుజువైతే గెలిచిన వారి ఎన్నికను రద్దు చేసేందుకు ఈ బిల్లు ఉద్దేశించింది. కాగా శాసనసభలో అధికారపక్షానికి బలం ఉండటంతో గతంలో బిల్లు ఆమోదం పొందింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లు మండలికి వెళ్లగా అక్కడ సవరణలు ప్రతిపాదించి అసెంబ్లీకి తిప్పి పంపారు. మండలి ప్రతిపాదించిన సవరణలను తాజాగా అసెంబ్లీ తిరస్కరించింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండలి సవరణలను తిరస్కరించే ప్రతిపాదనను శాసనసభలో ప్రవేశపెట్టగా టిడిపి సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మండలి సవరణలపై చర్చించాలని చంద్రబాబుతో సహా సభ్యులు నిలబడి నిరసన తెలిపారు. కొంత మంది వెల్లోకెళ్లి స్పీకర్ తమ్మినేని సీతారాంతో వాగ్వాదానికి దిగారు. టిడిపి సభ్యులను సభాపతి వారించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జోక్యం చేసుకొని బిల్లుపై గతంలో కూలంకషంగా చర్చ జరిగిందని, ఆర్డినెన్స్ కూడా జారీ అయిందని, ఇప్పుడు జరిగేది కేవలం లాంఛనప్రాయమని, తిరిగి చర్చ అవసరం లేదని అన్నారు. తమకు 151 మంది సభ్యులు ఉన్నారని గుర్తు చేశారు. నివర్ తుపానుపై వ్యవసాయ మంత్రి కె కన్నబాబు ప్రకటన చేసేందుకు ఉపక్రమించగా, కొద్దిసేపు ఆందోళన చేసిన టిడిపి సభ్యులు ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. కొద్ది సేపటికి తిరిగి సభలోకొచ్చి నివర్ తుపానుపై చర్చలో పాల్గన్నారు.