Jun 13,2021 16:18

లక్నో : యుపిలోని కాషాయపార్టీలో కలకలం మొదలైంది. వచ్చే ఏడాది యుపిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ లుకలుకలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కరోనా నివారణలో యోగి విఫలమయ్యారన్న విమర్శలు మూటగట్టుకోవడంతో.. ఒకవేళ యోగీని దించితే హిందువుల ఓట్లు చీలుతాయేమోన్న ఆందోళనలో అధిష్టానం తలలు పట్టుకుంటోంది. ఇటీవల యుపి నాయకత్వాన్ని మారుస్తారంటూ వచ్చిన వార్తలు సంచలనంగా మారగా, అదే సమయంలో యోగి ఢిల్లీ పర్యటన కూడా ప్రాథాన్యత సంచరించుకుంది. దీంతో ఆయన మార్పుతప్పదన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఈ సమయంలో నాయకత్వ మార్పుతో నష్టం కూడా వచ్చే ప్రమాదం ఉందని యోగి మద్దతు దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా సంక్షోభాన్ని అడ్డుకోవడంలో యోగి విఫలమయ్యారంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. ఈ భావన ప్రజల్లోకి కూడా బలంగా వెళ్లింది. ఫలితంగా పంచాయితీ ఎన్నికల్లో ఆశించిన స్థానాలు దక్కలేదు. సాథారణంగా ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీయే అధిక స్థానాలను గెలుచుకుంటుంది. అయితే అందుకు విరుద్ధంగా బిజెపి కేవలం మూడోవంతు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలో యోగి తీరుపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, ఎంపిలు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. దీంతో అధిష్టానానికి ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది.

ప్రధాని మోడీకి యోగిపై మొదటి నుండి సదభిప్రాయం లేదు. 1998లో మొదటి సారిగా యోగి పార్లమెంటులో అడుగు పెట్టి, ఐదు సార్లు ఎంపిగా ఎన్నికైనప్పటికీ .. మోడీ కేబినెట్‌లో ఇప్పటివరకు ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. 2017లో జమ్ముకాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న మనోజ్‌ సిన్హాను యుపి ముఖ్యమంత్రిగా చేయాలని ఆదేశించారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుతో యోగి ఆ పదవిని దక్కించుకున్నారు. కాని, యోగి తీరుపట్ల అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది. ఇటీవల ప్రధాని సన్నిహితుడిగా పేరుపొందిన మాజీ ఐఎఎస్‌ అధికారి ఎకె. శర్మను హాడావుడీగా ఎమ్మెల్యేను చేయడం, యుపి మంత్రి వర్గంలో ఆయనకు కీలక స్థానం కల్పించడం తనకు చెక్‌ పెట్టేందుకేనని యోగి భావిస్తున్నారు.

ప్రతి ఏడాది జూన్‌ ఐదున యోగికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పే ప్రధాని, అమిత్‌షా, నడ్డాలు ఈ ఏడాది మౌనంగా ఉన్నట్లు సమాచారం. అలాగే మే చివరి వారంలో ఢిల్లీలో మోడీ నేతృత్వంలో యుపి పరిస్థితులపై ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో జరిగిన సమావేశంలో అమిత్‌షా, నడ్డా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ మాత్రమే పాల్గన్నారు. రాష్ట్ర బిజెపి చీఫ్‌ స్వతంత్ర దేవ్‌ సింగ్‌ను కూడా ఆహ్వానించలేదు. దీంతో అసంతృప్తికి గురైన యోగి ఆర్‌ఎస్‌ఎస్‌ నేత దత్తాత్రేయ హొసబలేని కూడా కలవలేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు యుపి గవర్నర్‌, స్పీకర్‌లతో ఈ నెల మొదటి వారంలో బిజెపి ఉపాధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ రాధామోహన సింగ్‌ భేటీ కావడం కూడా కలకలం రేపుతోంది. దీంతో సిఎంను మారుస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తలను ఆయన కొట్టిపారేశారు.

మారిస్తే.. నష్టమే..
యోగికీ జనాకర్షణ లేకపోయినా పార్టీలో గుర్తింపు ఉంది. గతంలో కంటే సిఎం అయిన అనంతరం ఆయన జాతీయ స్థాయిలో హిందూ నేతగా గుర్తింపు పొందారు. కరోనావైఫల్యంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ.. యుపి లాంటి రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించే మరో నేత లేకపోవడం ప్రధాన కారణం. తనను సిఎం పదవి నుండి తప్పిస్తే.. యోగి తన బలంతో ఎదురుతిరగవచ్చని అధిష్టానం భావిస్తోంది. కల్యాణ్‌సింగ్‌, యడియూరప్ప, ఉమాభారతి, కేశూభారు పటేల్‌లాగా ఎదురుతిరగవచ్చని.. దీంతో హిందూ ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉందని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ నేత జితిన్‌ ప్రసాదను పార్టీలోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అలాగే అప్నాదళ్‌ నేత అనూప్రియా పటేల్‌, నిషాద్‌ పార్టీకి చెందిన సంజరు నిషాద్‌తోనూ అమిత్‌షా చర్చలు జరిపినట్లు సమాచారం. మోడీ ప్రభావంతో యుపి ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వస్తాయన్న నమ్మకం లేదు. దీంతో హిందూ మతం ఓట్లను కూడా చీలిస్తే.. పార్టీకి ఇంకా పెద్ద నష్టం ఏర్పడుతుందన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు యోగిని సిఎంగా కొనసాగించాలని పట్టుపడుతున్నా.. మరికొందరు ఆయన నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.