Apr 14,2021 14:02

లక్నో : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. సిఎం కార్యాలయంలోని కొంత మంది అధికారులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణకావడంతో... ఆదిత్యనాథ్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. బుధవారం నిర్వహించిన పరీక్షల్లో తనకు పాజిటివ్‌గా నిర్థారణైనట్లు వెల్లడించారు. దీంతో తనతో సన్నిహితంగా ఉన్నవారందరూ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు. కాగా, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ కూడా కరోనా బారిన పడ్డారు. ఆయన ఈ నెల ప్రారంభంలో కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోసును తీసుకున్నారు. కరోనా కేసులు అధికమౌతున్న నేపథ్యంలో... ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 30 వరకు విద్యాసంస్థలను మూసివేయాల్సిందిగా ఆదేశించింది. అలాగే రాత్రివేళల్లో కర్ఫ్యూ విధించింది.