Oct 28,2021 19:21

యాత కులస్తులను ఉద్దేశించి మాట్లాడుతున్న బిసి కమిషన్‌ చైర్మన్‌ శంకరనారాయణ

ప్రజాశక్తి-విజయనగరం : కల్లుగీతనే వృత్తిగా చేసుకొని జీవిస్తున్న యాత కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వెనుకబడిన వర్గాల కమిషన్‌ చిత్తశుద్దితో ప్రయత్నిస్తుందని కమిషన్‌ చైర్మన్‌ ఎ.శంకరనారాయణ చెప్పారు. నగరంలోని బుంగవీధి(అశోక్‌నగర్‌) ప్రాంతంలో యాత కులస్థులు నివసిస్తున్న ప్రాంతాన్ని బి.సి.కమిషన్‌ గురువారం సందర్శించింది. కమిషన్‌ ఛైర్మన్‌ ఏ.శంకరనారాయణ, సభ్యులు మారక్కగారి కృష్ణప్ప, పక్కి వెంకటసత్య దివాకర్‌, అవ్వారు ముసలయ్య, కార్యదర్శి చంద్రశేఖర రాజు తోపాటు జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి యాత కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి జీవన పరిస్థితులను వారిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కల్లుగీత వృత్తినే నమ్ముకున్న తమకు ఏడాది పొడవునా పని దొరకడం లేదని, ఈత చెట్లు నరికివేస్తున్న కారణంగా తాము ఉపాధి కోల్పోతున్నామని, తమకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని కోరారు. తమ కులవృత్తి పూర్తిగా అంతరించి పోతోందని, తమకు ప్రత్యామ్నాయ ఉపాధి ఏదైనా చూపాలని బాబ్జీ అనే యువకుడు కోరారు. లావణ్య అనే మహిళ మాట్లాడుతూ తన భర్త చనిపోయి ఏడాది గడుస్తున్నా తనకు ఎలాంటి సహాయం అందలేదని, తనకు అంగన్‌వాడీ కేంద్రంలో ఆయా పోస్టును ఇచ్చి తన ఇద్దరు పిల్లలను పోషించుకొనే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. యాత కులస్థులు పేదరికంలో ఉన్న కారణంగా తమ పిల్లలను కూడా చదివించుకోలేని పరిస్థితిలో వున్నారని, దుప్ప పైడిరాజు అన్నారు. మత్స్యకారులకు చేపలవేట లేని సమయంలో భృతి ఇస్తున్నట్లే తమకూ భృతి ఇవ్వాలని చుక్క నగేష్‌ కోరారు. నగరంలో తమ కులం వారికి ఒక కమ్యూనిటీ హాలు నిర్మించుకొనేందుకు స్థలం మంజూరు చేయాలని కోరారు. జిల్లాలో ఏయే ప్రాంతాల్లో ఎంత జనాభా వున్నదీ కమిషన్‌ చైర్మన్‌ అడిగి తెలుసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన సమాచారం ఆధారంగా చర్చించి ప్రభుత్వానికి తగిన సిఫారసులు చేస్తామని ఛైర్మన్‌ శంకర నారాయణ చెప్పారు. జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ యాత కులం వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి ఆర్ధికాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని బిసి కమిషన్‌ ను కోరారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌(ఆసరా) జె.వెంకటరావు, బి.సి.సంక్షేమాధికారి కీర్తి, బి.సి.కార్పొరేషన్‌ ఇ.డి. పెంటోజీ తదితరులు పాల్గొన్నారు.