Oct 28,2021 18:08

చర్చలో మాట్లాడుతున్న వ్యవసాయశాఖ ఎడి విజరు

మక్కువ : ప్రస్తుతం రైతులు అవలంభించే వ్యవసాయ విధానంలో మార్పులు రావాలని వ్యవసాయశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వై విజరు అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా రైతులతో చర్చా కార్యక్రమం గురువారం మండలంలోని డి-శిర్లాం రైతు భరోసా కేంద్రంలో నిర్వహించారు. ఈ చర్చలో విజరు మాట్లాడుతూ రైతులు పాత విధానాలను విడనాడి సమగ్ర సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయం కొనసాగించినట్లయితే ఖర్చులు తగ్గి దిగుబడులు పెరుగుతాయని సూచించారు. వాతావరణంలో అనేక మార్పులు వచ్చాయని రైతులకు అతి పెద్ద సమస్య ఈ వాతావరణ మార్పులేనన్నారు. కావున రైతులంతా దీనిపై అవగాహన పెంచుకుని వ్యవసాయం కొనసాగించాలని కోరారు ప్రాచీన పొడుగు రకాల స్థానంలో ఎరువులకు ఎక్కువగా స్పందించే పొట్టి వంగడాల రావడం సేంద్రియ ఎరువుల స్థానంలో రసాయన ఎరువుల ప్రాధాన్యత సంతరించుకోవడం మార్కెట్‌ను బట్టి వ్యవసాయం చేయడం వంటి ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర పొంది లాభసాటిగా మారాలంటే అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేల, నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చి భూసారం పెంపొందించే దిశగా అడుగులు వేసి ప్రభుత్వానికి రసాయన ఎరువుల సబ్సిడీ భారాన్ని తగ్గించాలని కోరారు. ఎంపిటిసి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ గ్రామంలో ఈ రబీ సీజన్లో డ్రమ్‌ సీడ్‌ విధానాన్ని అలవాటు చేయాలని, జీవన ఎరువులను, కషాయాలను అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎఒ కె.తిరుపతిరావు, గ్రామ వ్యవసాయ సహాయకులు రమా, రైతులు పాల్గొన్నారు.