Oct 17,2021 12:05

పుస్తకం, సినిమా రెండు భిన్నమైన మాధ్యమాలు.. నవలల స్ఫూర్తితో సినిమాలు తీయడం 1970ల్లో ఎక్కువగా ఉండేది. కాలక్రమంలో తగ్గాయి. ఆ లోటును తీర్చుతూ, ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన 'కొండపొలం' నవలను క్రిష్‌ జాగర్లమూడి అదే పేరుతో తెరకెక్కించారు. 'ఉప్పెన' లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటించిన రెండో చిత్రం. ఉద్యోగం రాక భయంభయంగా జీవితం సాగించే ఓ కుర్రాడు ఆత్మ విశ్వాసంతో తాను అనుకున్నది ఎలా సాధించాడు? అడవి, అడవిలాంటి ఓ యువతి అతనిలో తెచ్చిన మార్పుమిటి? ఇలాంటి ఆసక్తికర అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది..? అంచనాలను చేరిందా లేదా..? వంటి విషయాలు తెలుసుకుందాం..!

టైటిల్‌: కొండ పొలం
తారాగణం: వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సాయిచంద్‌, రవిప్రకాష్‌, హేమ, కోట శ్రీనివాసరావు, ఆంటోని, రవిప్రకాశ్‌, మహేష్‌ విట్టా, రచ్చ రవి తదితరులు
కెమెరా: జ్ఞాన శేఖర్‌
ఎడిటర్‌: శ్రవణ్‌ కటికనేని
సంగీతం: కీరవాణి
సినిమాటోగ్రఫీ : జ్ఞాన శేఖర్‌ వీఎస్‌
నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి
రచన: సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి
దర్శకత్వం: క్రిష్‌ జాగర్లమూడి
విడుదల తేదీ: 8 అక్టోబర్‌ 2021

కథలోకి వెళ్తే.. కడప జిల్లాకు చెందిన కటారు రవీంద్ర యాదవ్‌ (వైష్ణవ్‌ తేజ్‌) బీటెక్‌ పూర్తి చేసి, హైదరాబాద్‌లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాడు. ఇంగ్లీష్‌ భాషలో ప్రావీణ్యం లేకపోవడం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం వల్ల చాలా ఇంటర్వూల్లో రిజెక్ట్‌ అవుతాడు. అతని తండ్రి గురప్ప (సాయి చంద్‌) గొర్రెల కాపరి. సగం గొర్రెలు కొడుకు చదువుకోసమే అమ్మేస్తాడు. చదువు పూర్తయ్యి నాలుగేళ్లు అయినా ఉద్యోగం రాకపోవడంతో ఇంటికొచ్చేస్తాడు రవీంద్ర. అదే సమయంలో గ్రామంలో గొర్రెల మందలు నీళ్లు లేక కరువుతో అల్లాడుతుంటాయి. దీంతో ఊరిలో కొంతమంది తమ గొర్రెల మందలను తీసుకుని 'కొండపొలం' మీదుగా నల్లమల అడవికి బయలుదేరుతున్నారని, వారితో కలిసి తమ గొర్రెలనూ తోలుకెళ్లమని సలహా ఇస్తాడు తాత రోశయ్య (కోట శ్రీనివాసరావు). దీంతో తండ్రికి తోడుగా రవీంద్ర గొర్రెల్ని కాస్తూ నల్లమల అడవికి వెళ్తాడు. దాదాపు 45 రోజుల పాటు అడవితో సహజీవనం చేసిన రవీంద్రలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆ అడవి అతనికి నేర్పిన పాఠాలేంటి? తన చదువు కోసం తండ్రి పడిన కష్టాలేంటి? చివరికి ఐఎఫ్‌ఎస్‌ అధికారి ఎలా అయ్యాడు? ఓబులమ్మ (రకుల్‌) అతని జీవిత ప్రయాణంలో తోడుగా ఎలా నిలిచింది అనేదే మిగిలిన కథ.
     సీమ నేపథ్యంలో కథ అంటే ఎక్కువగా ఫ్యాక్షన్‌.. పగ.. ప్రతీకారాలనే చూపిస్తుంటారు. అయితే ఈ కథలో మూగజీవాల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టేవారిగా సీమ వాసుల్ని చూపించారు. వారి యాసలోనే సంభాషణలు సాగుతాయి. గ్రామీణ పరిమళంతో అనేక సందర్భాలు ప్రేక్షకుల మనసును తడి చేస్తాయి. పశువుల ప్రాణాలను కాపాడుకోవడం కోసం అడవికి వెళ్లే గొర్రెకాపరులు, అక్కడ వారి జీవన పద్ధతిపై ఇంతవరకూ ఏ చిత్రమూ రాలేదు. ఆ రకంగా చూస్తే 'కొండపొలం' ఓ కొత్త ప్రయత్నం అనే చెప్పాలి. ప్రకృతి పరిరక్షణ, అడవిపై ఆధారపడిన కొన్ని వర్గాల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ, సామాజిక స్పృహతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. సోల్‌ ఉన్న కథకి కమర్షియల్‌ హంగులు జోడించే ప్రయత్నంలో భాగంగా నవలలో లేని ఓబులమ్మ (రకుల్‌) పాత్రను ఈ సినిమా కోసం సృష్టించారు రచయిత సన్నపురెడ్డి. 'ఏ భాషలో మాట్లాడినా అది గుండెను చేరుతుంది. కానీ మాతృభాషలో మాట్లాడితే మనసుకు చేరుతుంది'.. 'పెళ్లాం అంటే కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకోకూడదు.. చేయి పట్టి నడిపించాలి'.. 'అవతలి వాళ్ల చెప్పులో కాలు పెడితే కానీ తెలియదు అందులో ఎన్ని ముళ్లు ఉన్నాయో' వంటి డైలాగులు ఆకట్టుకుంటాయి. హీరోతో లవ్‌ ట్రాక్‌కి అన్నట్టుగానే కాకుండా.. పిరికివాడిలో పట్టుదలను నింపే గడసరి పిల్లగా ఓబులమ్మ పాత్రను చూపించారు. పిరికివాడైన హీరో.. భయస్తుడిగా అడవిలో అడుగుపెట్టి ఆ వాతావరణానికి అలవాటుపడి, అక్రమాలకు పాల్పడే వారికి బుద్ధి చెప్పిన వైనం ఆకట్టుకుంది. తన గొర్రెలను కాపాడుకోవడం కోసం పులితో పోరాటం చేయడం సినిమాకు హైలైట్‌. పతాక సన్నివేశాలు అలరించాయి.
    మంచి చదువు ఉండీ ఆధునిక ప్రపంచంతో పోటీపడలేక, గొర్రెల కాపరిగా మారిన యువకుడు రవీంద్ర పాత్రలో వైష్ణవ్‌ తేజ్‌ ఒదిగిపోయాడు. ఇక, అదే సామాజిక వర్గం, వృత్తి కలిగిన అమ్మాయి ఓబులమ్మ పాత్రలో రకుల్‌ ప్రీత్‌ అద్భుత నటనను కనబరిచి, పాత్రకు న్యాయం చేసింది. గురప్ప పాత్రలో సాయిచంద్‌ పరకాయ ప్రవేశం చేశాడు. అచ్చం గొర్రెల కాపరిలానే తెరపై కనిపించాడు. ఇతర పాత్రల్లో ఆంథోని, హేమ, రవిప్రకాశ్‌, మహేశ్‌ విట్ట, రచ్చ రవి, అశోక్‌ వర్థన్‌ తదితరులు పరిధిమేర నటించారు. అడవి అందాలను తన కెమెరా పనితనంతో అద్భుతంగా చూపించారు జ్ఞానశేఖర్‌. ఇక కీరవాణి సంగీతం, బిజిఎం ఈ సినిమాకి ప్లస్‌. ఎడిటర్‌ శ్రవణ్‌ కటికనేని తన కత్తెరకు పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. ఓ మంచి సందేశాత్మక చిత్రాన్ని చూశామనే అనుభూతి మాత్రం ప్రేక్షకుడికి కలుగుతుంది.