
అమరావతి బ్యూరో : కరోనా వ్యాక్సిన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలు, కడప, గుంటూరు, విశాఖల్లో నాలుగు కోల్డ్ స్టోరేజీ పాయింట్లు ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ సిఎం ఆళ్లనాని తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 24 గంటలు పనిచేయడానికి వీలుగా 104 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని, రాష్ట్ర స్టోరేజి పాయింట్‌గా కృష్ణా జిల్లా గన్నవరంను ఎంపిక చేశామని ఈ ప్రకటనలో ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా13 జిల్లా వ్యాక్సిన్ స్టోర్స్, 1,659 కోల్డ్ చైన్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సిఎం వెల్లడించారు. ఆరోగ్యసిబ్బంది, ఫ్రంట్‌లైన్ వారియర్స్ కానటువంటి సాధారణ ప్రజలు వ్యాక్సినేషన్ కోసం కోవిడ్ రిజిస్ట్రేషన్ విభాగంలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. వీరికి ఫోటో ఐడెంటిటీ తప్పని సరని తెలిపారు. పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికేసుమారు 200 హాస్పిటల్స్ని గుర్తించామన్నారు. 100మంది సిబ్బంది ఉన్న ప్రయివేటు హాస్పిటల్స్‌ను వినియోగించనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో వ్యాక్సిన్ వేయించుకునే 3,87,983 మందిని అధికారులు గుర్తించినట్లు తెలిపారు.