Dec 02,2021 19:58

చిన్న వయసులోనే ఇంటి అవసరాలకు ఉపయోగపడే పరికరాలను తయారు చేసి అద్భుతాలు సృష్టిస్తున్నాడు ఆ విద్యార్థి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని వస్తాద్‌ వారి వీధిలో నివాసం ఉంటున్న షేక్‌ మహమ్మద్‌ హనీఫ్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఇంట్లో అవసరాలను తెలుసుకుంటూ దానికి అనుగుణంగా పనికి రాని వస్తువులతో ప్రయోగాలు చేస్తున్నాడు.

హనీఫ్‌ తండ్రి మౌలానా మహమ్మద్‌ హుస్సేన్‌ పట్టణంలోని మసీదులో ఇమామ్‌. ఆయనకు హనీఫ్‌ నాలుగో సంతానం. ఆరవ తరగతిలో చెడిపోయిన ఎలక్ట్రికల్‌ వస్తువులు, పాత బ్యాటరీలతో ఒక ప్రాజెక్టు తయారు చేశాడు. అది చూసిన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు మెచ్చుకున్నారు. ఆ తర్వాత పాత వస్తువులను సేకరించి ఇంట్లోకి అవసరమైన, ఆట వస్తువుల కోసం ఏదో ఒకటి తయారుచేయడం ప్రారంభించాడు హనీఫ్‌. పడేసిన సెల్‌ఫోన్‌ బ్యాటరీలతో వివిధ రకాలైన వస్తువులు తయారు చేస్తూ ఇంటి అవసరాలకు ఉపయోగిస్తున్నాడు.

వృథా వస్తువులతో పనికొచ్చే పరికరాలు
తయారు చేసిన వస్తువులు
వాడి పడేసిన ప్లాస్టిక్‌ డబ్బాలు, ఉపయోగం లేని పైపులు, చెడిపోయిన సెల్‌ బ్యాటరీలతో ఎలక్ట్రికల్‌ వస్తువులు తయారు చేసి ఉపయోగిస్తున్నాడు. కరెంటు లేనప్పుడు వీటిని వెలిగించవొచ్చు. వీటికి ఛార్జీంగ్‌ కూడా పెట్టే వీలు కల్పించాడు.
-. తలస్నానం చేసి వెంట్రుకలను ఆరబెట్టేందుకు పిల్లలు ఆడుకునే తుపాకీతో ఫ్యాన్‌ తయారు చేశాడు. ఇది హైడ్రీమ్‌ వలే పనిచేస్తుంది.
-. వంటగది, బెడ్‌రూం, బాత్‌రూంలలో విద్యుత్‌ లేనప్పుడు వెలుగును నింపేందుకు సెల్‌ బ్యాటరీ సాయంతో స్విచ్‌బోర్డు ఏర్పాటు చేసి, టార్చ్‌లైట్‌ బల్బుతో వెలుగులు నింపుతున్నాడు.
-. బొట్టు బిళ్లలు వేసుకునే ప్లాస్టిక్‌ డబ్బాతో సెల్‌ బ్యాటరీ అమర్చి దానికి అనుసంధానంగా బల్బును అమర్చి టార్చ్‌లైట్‌ తయారు చేశాడు. దీనికి ఛార్జింగ్‌ పెట్టే వీలు కూడా కల్పించాడు.
-.విద్యుత్‌ పోయినప్పుడు చంటి పిల్లలు గాలి కోసం ఏడుస్తుంటే... ప్లాస్టిక్‌ పైపు, వంకబెండు పైపులతో కలిపి ఫ్యాన్‌ తయారు చేశాడు. ఇది పిల్లల ముఖం వరకు గాలి తగులుతుంది. దాంతో పిల్లలు ఏడుపు మాన్పిస్తున్నాడు. దీనిని కూడా ఛార్జింగ్‌ చేసుకోవొచ్చు.

వృథా వస్తువులతో పనికొచ్చే పరికరాలు
ట్యాంక్‌ నిండితే అలారం
ద్విచక్ర వాహనాల సైడ్‌లైట్లకు సిగల్‌ వచ్చే బజర్‌ను ఉపయోగించి ఈడబ్ల్యూ బ్యాటరీ సాయంతో మిద్దె పైన ఉండే నీటి ట్యాంకు నిండిందా? లేదా? అని గుర్తించడానికి ట్యాంక్‌ సిగల్‌ సిస్టమ్‌ను తయారు చేశాడు. దీనివల్ల ట్యాంక్‌ నీళ్లతో నిండితే సైరన్‌ శబ్దం చేస్తుంది. మిద్దెపైకి ఎక్కి ట్యాంక్‌ చూసుకునే పని లేకుండా ఈ పరికరం తయారు చేశాడు. దీనికి గానూ రూ.90 ఖర్చు అవుతుంది. ఇటువంటి పరికాలను పట్టణంలో 100 ఇళ్లకు పైగా అమర్చాడు. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీర్‌గా ఎదగాలనేది ఈ విద్యార్థి కోరిక.
                                                             - షేక్‌ వలీ సాహెబ్‌.. ప్రజాశక్తి, యర్రగొండపాలెం విలేకరి