Feb 23,2021 19:28

అమరావతి బ్యూరో: మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల (వంటలమ్మలు) పట్ల రాష్ట్ర ప్రభుత్వం పొమ్మనలేక పొగపెడుతున్న చందంగా వ్యవహరిస్తోంది. వైసిపి అధికారంలోకి వచ్చాక మధ్యాహ్న భోజన పథకానికి జగనన్న గోరుముద్ద అని పేరు పెట్టి, దానిలో పౌష్టికాహారానికి సంబంధించిన మెనూను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రాథమిక పాఠశాలలో ఒక్కో విద్యార్థికి రూ.4.97, హైస్కూల్‌లో ఒక్కో విద్యార్థికి రూ.7.10 చొప్పున ఇస్తోంది. ఈ రేటు ప్రకారం మధ్యాహ్న భోజన పథకం కార్మికులు విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యతగల పౌష్టికాహారం అందించాల్సి ఉంది. పథకం ప్రారంభమయ్యాక ముచ్చటగా మూడు నెలలు కూడా కార్మికులకు ప్రభుత్వం నుంచి వేతనాలు అందలేదు. 2020 మార్చి నుంచి నేటికీ వంటలమ్మలకు వేతనాలు లేవు. రాష్ట్రంలో 88 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇటీవల మూడు నెలలకు గాను రూ.వెయ్యి చొప్పున రూ.3 వేలు కార్మికుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. తొమ్మిది నెలలకు నెలకు రూ.3 వేలు చొప్పున 237.60 కోట్లు, మూడు నెలలకు రూ.2 వేలు చొప్పున రూ.52.80 కోట్లు, మొత్తానికి రూ.290.40 కోట్లు రాష్ట్రప్రభుత్వం వంటలమ్మలకు చెల్లించాల్సి ఉంది. మెనూ బిల్లులు ప్రభుత్వం నుంచి సకాలంలో అందకపోవడంతో కార్మికులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇప్పటికే రూ.5 నుంచి రూ.7 వడ్డీకి అప్పులు తెచ్చి వంట చేస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని సమాచారం. హైస్కూల్లో వంట చేసే కార్మికురాలికి ఇప్పటికి సుమారు రూ.70 వేలు, ప్రాథమిక పాఠశాల వంటలమ్మకు సుమారు రూ.20 వేలు చొప్పున బిల్లులు రావాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఆరు వేల హైస్కూల్స్‌, 38 వేల ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. దీని ప్రకారం చూసినా మొత్తం సుమారు రూ.118 కోట్లు మెనూ బిల్లులు పెండింగులో ఉన్నాయి. గతేడాది చిక్కీ బిల్లుల బకాయిలు అదనం. అక్షయపాత్ర, ఇస్కాన్‌, ఏక్తాశక్తి, నవప్రయాస వంటి స్వచ్ఛంద సంస్థలకు ఈ పథకాన్ని కట్టబెట్టాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ వేతనాలు, బిల్లులు ఇవ్వడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా స్పందించి, పెండింగ్‌ వేతనాలు, మెనూ, చిక్కీ బిల్లులు అందించి తమను అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు.