Nov 21,2020 09:12

హైదరాబాద్‌ : ప్రముఖ సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్‌ను చంపేస్తామంటూ బెదిరించిన ఇద్దరిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్‌ కళింగరావు కథనం ప్రకారం.. ఫిలింనగర్‌కు చెందిన వందేమాతరం శ్రీనివాస్‌ అలియాస్‌ కె.శ్రీనివాస్‌రావు కెబిఆర్‌ పార్క్‌లో వాక్‌కు వెళ్లిన సమయంలో ఫిలింనగర్‌ అపోలో ఆసుపత్రి సమీపంలో నివసించే తిరుపతయ్యతో పరిచయం ఏర్పడింది. పరిచయం క్రమంగా స్నేహానికి దారితీసింది. ఈ క్రమంలో 2018లో కర్నూలు జిల్లా నందికొట్కూరుకి చెందిన కాంట్రాక్టర్‌ అయిన తన మామయ్య రంగస్వామితో కలిసి శ్రీనివాస్‌ను తిరుపతయ్య కలిశాడు. తన వ్యాపార అవసరాల కోసం రూ.30 లక్షలు ఇస్తే మూడు, నాలుగు నెలల్లో తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. వారిని నమ్మిన శ్రీనివాస్‌ పలు దఫాలుగా రూ.30 లక్షలు ఇచ్చారు. మూడు నాలుగు నెలల్లో తిరిగి వెనక్కి ఇచ్చేస్తామన్న తిరుపతయ్య, రంగస్వామిలు నెలలు గడుస్తున్నా డబ్బులు తిరిగి చెల్లించలేదు. దీంతో నెల రోజుల క్రితం తన స్నేహితుడైన మధుసూదన్‌రెడ్డితో కలిసి తిరుపతయ్య ఇంటికి వెళ్లిన శ్రీనివాస్‌ డబ్బులు అడిగాడు. దీంతో చంపేస్తానంటూ శ్రీనివాస్‌ను తిరుపతయ్య బెదిరించాడు. శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు తిరుపతయ్య, రంగస్వామిలపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.