Dec 03,2021 21:26

కాబూల్‌ : మహిళలను 'ఆస్తి'గా పరిగణించకూడదని, వివాహ విషయంలో ఆమె సమ్మతి ఖచ్చితంగా ఉండాలని ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్‌ ప్రభుత్వం శుక్రవారం డిక్రీ జారీ చేసింది. మహిళల విద్య, మహిళలు ఇంటి వెలుపల పనిచేయడం గుర్తించడంలో విఫలమైన తాలిబాన్‌ ప్రభుత్వం ఈ విధమైన డిక్రీ జారీ చేయడం విశేషం. మహిళ హక్కులకు కట్టుబడి ఉండాలని ఆగష్టులో అధికారంలోకి వచ్చిన తాలిబాన్ల ప్రభుత్వంపై అంతర్జాతీయంగా ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌కు నిధులను స్తంభింప చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఈ డిక్రీ జారీ అయింది. 'స్త్రీ ఒక ఆస్తి కాదు, గొప్పా స్వేచ్ఛా జీవి. ఎవరూ ఆమెను ఎవరికీ ఇవ్వలేరు, శాంతికి బదులుగా ఆమెను మార్పడి చేయలేరు, శత్రుత్వాన్ని అంతం చేయలేరు' అని తాలిబాన్‌ ప్రతినిధి జబిహిల్లా ముహాజిద్‌ విడుదల చేసిన డిక్రీ తెలిపింది. స్త్రీలను బలవంతంగా వివాహం చేసుకోకూడదని, మరణించిన భర్త ఆస్తిలో వితంతువులకు వాటా ఉంటుందని డిక్రీ స్పష్టం చేసింది.