
అనంతపురం : విశాఖ ఉక్కును కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెట్టాలనే కేంద్రప్రభుత్వం చూస్తోందని, రాష్ట్ర ప్రజలకు బిజెపి నేతలు క్షమాపణలు చెప్పాల్సిందేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈనెల 5న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతపురం సిపిఐ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కు కోసం ఎన్నో ఆత్మబలిదానాలు జరిగాయని గుర్తు చేశారు. దీనిని ఎలాగైనా రాష్ట్ర ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర బిజిపి నేతలు ఢిల్లీకి వెళ్తే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, పైగా కేంద్రమంత్రులు క్లాస్ పీకారని తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు బిజెపి నేతలు ఏం సమాధానం చెబుతారన్నారు. మరోవైపు రాష్ట్రంలో బెదిరింపులతో పాలన సాగుతోందన్నారు. పోలీసులు, వాలంటీర్లు కలిసి డబ్బులతో ఎన్నికల్లో గెలుపొందుతున్నారన్నారు. ఎవరు నామినేషన్ వేయాలి, ఎవరు విత్డ్రా చేయాలో కూడా పోలీసులే చెబుతున్నారన్నారు. డిఎస్పిలే ఏకగ్రీవం చేస్తున్నారన్నారు. మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో అదే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం పోలీసులే చేస్తే.. ఇక మంత్రులు ఎందుకు అని ప్రశ్నించారు. విశాఖ లో విజయసాయిరెడ్డి విత్ డ్రా చేసుకుంటే కోటి రూపాయలు ఆఫర్ చేస్తున్నారని మండిపడ్డారు.