Nov 26,2021 07:28
  • మండలిలో పిడిఎఫ్‌ వాయిదా తీర్మానం
  • తిరస్కరించిన చైర్మన్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడంపై చర్చ నిర్వహించాలని పిడిఎఫ్‌ ఎంఎల్‌సిలు పట్టుబట్టారు. ఈ మేరకు విఠపు బాలసుబ్రహ్మణ్యం, వై శ్రీనివాసులురెడ్డి, ఐ వెంకటేశ్వరరావు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు తిరస్కరించారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యాసంస్థల(ఉపాధ్యాయుల శ్రేణిలో రిజర్వేషన్‌) బిల్లు 2021ను ప్రవేశపెట్టాలని మంత్రిని కోరారు. మంత్రి బిల్లును పరిచయం చేయకముందే పిడిఎఫ్‌ ఫ్లోర్‌లీడర్‌ విఠపు బాలసుబ్రహ్మణ్యం లేచి రాష్ట్ర ప్రయోజనాల్లో ముఖ్యమైన విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం వల్ల కలిగే నష్టాలపై చర్చ నిర్వహించాలని చైర్మన్‌ను మరోసారి కోరారు. శాసనసభ, శాసనమండలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉభయసభల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకువచ్చేందుకు మండలిలో చర్చ జరగాల్సిందేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగ పోరాటాలకు తలొగ్గి వ్యవసాయ నల్లచట్టాలను వెనక్కి తీసకుందని తెలిపారు. ప్రజా ఉద్యమాలు, ఒత్తిడికి కేంద్రం వెనకడుగు వేస్తోందని, ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎందరో విద్యార్థుల బలిదానంతో సాధించుకున్న విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు మండలిలో చర్చ అవసరమన్నారు. వై శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ గాజువాక తలసరి ఆదాయం దేశంలోనే అత్యధికంగా ఉందని చెప్పారు. విశాఖ ఉక్కుకు ఇనుప ఖనిజపు గనులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించకపోయినా దేశంలోనే అత్యుత్తమ ఉక్కును అందిస్తోందని తెలిపారు. ఇటువంటి ఫ్యాక్టరీని కేంద్రం కార్పొరేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని కోరారు. ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కరోనా కష్టసమయంలో దేశానికి ఆక్సిజన్‌ అందించి బ్రతికించిన విశాఖ ఉక్కును రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ల కబంద హస్తాల్లోకి నెట్టే చర్యలను ఉపసంహరించుకోవాలన్నారు.
 

                                          ప్రభుత్వ వైఫల్యంతోనే వరద నష్టం

రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోక పోవడంవల్లే వరదల్లో కోలుకోలేని దెబ్బ తగిలిందని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు, కడప,నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ముందుగా చర్యలు తీసుకుని వుంటే ఇంత ప్రాణనష్టం, విద్వంసం జరిగేది కాదని పిడిఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ విఠపు బాలసుబ్రమణ్యం అన్నారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో 46 చెరువులు కబ్జాకు గురయ్యాయని అందుకే నీరు మొత్తం రోడ్లపైకి వచ్చిందని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి అన్నారు. రోడ్లు, బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నా ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించక పోవడంతో ఇప్పటికీ రవాణా సౌకర్యం పునరుద్దరణకు నోచుకోలేదని అన్నారు. ప్రజలు సర్వం కోల్పోతే అండగా వుండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెండువేలు ఇచ్చి చేతులు దులుపు కోవడం సరికాదన్నారు. వరద బాదితులకు అన్ని రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రతి కుటుంబానికి రూ10వేల రూపాయలను ఇవ్వాలన్నారు. గుంటూరు జిల్లాలో పత్తి, మిరప పంటలకు తీవ్రనష్టం వాటిళ్లిందని రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కెఎస్‌ లక్ష్మణ్‌రావు కోరారు. పించా డ్యామ్‌, అన్నమయ్య డ్యామ్‌లు గత ఏడాది దెబ్బ తిన్నా పనులు చేయకపోవడం వల్లే ఈ ఏడాది గ్రామాలకు గ్రామాలు కొట్టుకు పోయాయని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అన్నారు. వరదల్లో మృతుల కుటుంబాలకు రూ 5లక్షల ఎక్స్‌గ్రేసియా సరికాదని విశాఖలోని ఎల్‌జి పాలిమర్స్‌లో ఇచ్చిన విదంగా కోటి రూపాయలు ఇవ్వాలని బిజెపి ఎమ్మెల్సీ మాదవ్‌ డిమాండ్‌ చేశారు. వ్యవసాయ పంటలతో పాటు రొయ్యల చెరువులకు తీవ్ర నష్టం వాటిళ్లిందని వారిని ఆదుకోవాలని ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి అన్నారు.