Feb 12,2021 22:33

gudiwada lo karmikula nirasana

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌, గుడివాడ టౌన్‌, జగ్గయ్యపేట రూరల్‌ : విశాఖ ఉక్కు ప్యాక్టరీ ప్రయివేటీకరణకు కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్యలను నిరశిస్తూ వివిధ కార్మిక సంఘాలు, ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ రంగంలోనే ఉక్కు పరిశ్రమను కొనసాగించాలనీ, ప్రభుత్వమే గనులు కేటాయించాలని నాయకులు డిమాండ్‌చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమానికి ఆంధ్ర రాష్ట్ర తపాలా ఉద్యోగుల సమన్వయ సమితి రాష్ట్ర కార్యదర్శి బి.శ్రీధర్‌బాబు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. లాభాల బాటలో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ఎలా ప్రయివేటు పరం చేస్తారని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం జరిగే ఉద్యమాల్లో విజయవాడ నగరంలోని పన్ను చెల్లింపుదారులందరూ పాల్గొనాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు వి.సాంబిరెడ్డి, ఎం.వి. ఆంజనేయులు పిలుపునిచ్చారు. జగ్గయ్యపేట మండలంలోని లైం స్టోన్‌ మైన్స్‌ మెయిన్‌ గేటు వద్ద అఖిల పక్ష కార్మిక సంఘాలైన బిఎంఎస్‌, సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, డిఐటియు సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం కార్మికులు ధర్నా నిర్వహించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కార్మికులు, నాయకులు ముక్తకరఠంతో డిమాండ్‌చేశారు. సిఐటియు. ఆధ్వర్యంలో గుడివాడలోని నీలామహాల్‌ సెంటర్‌లో కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సిఐటియు తూర్పుకృష్ణా ఉపాధ్యక్షులు ఆర్‌సిపి రెడ్డి మాట్లాడారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
జగ్గయ్యపేట రూరల్‌ : విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మండలంలోని విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ జగ్గయ్యపేట లైం స్టోన్‌ మైన్స్‌ మెయిన్‌ గేటు వద్ద అఖిల పక్ష కార్మిక సంఘాలైన బిఎమ్‌ఎస్‌, సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, డిఐటియు సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం స్ట్రాటజిక్‌ సేల్‌ పేరుతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రయివేటు పరం చేసే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు. విశాఖ ఉక్కుకు సొంత ఐరన్‌ ఓర్‌ గనులును కేటాయించాలని డిమాండ్‌చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు వివిధ రూపాల్లో అందోళనలు కొనసాగించాలని నిర్ణయించారు. బిఎంఎస్‌ నాయకులు పిఎస్‌ఎన్‌.రాజు, రామచంద్రనాయక్‌, ఎస్‌.కష్ణారావు, సిఐటియు నాయకులు ఎం.ఫిలిప్‌, డి.విజయకుమార్‌, ఐఎన్‌టియుసి నాయకులు బి.బాధ్య, బి.విశ్వాసరావు, ఎఐటియుసి నాయకులు జెబెస్‌డి ప్రసాద్‌, వలిబాబు, కోటేశ్వరరావు, డిఐటియు నాయకులు ఎం.మరియారావు, కార్మికులు మన్నె శ్రీనివాసరావు, సురేష్‌ కుమార్‌, సన్యాసిరావు, జోమి థామస్‌, సురేంద్ర నాయక్‌, రాం ప్రసాద్‌, విక్రమ్‌, రవితేజ, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు
గుడ్లవల్లేరు : మండలంలోని కౌతవరం గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ ఆపాలని కోరుతూ శుక్రవారం ధర్నా నిర్వహించారు. సిఐటియు మండల అధ్యక్షురాలు ఎం.జయలక్ష్మి, సిఐటియు తూర్పుకృష్ణా నాయకులు బి.వి.శ్రీనివాసరావు మాట్లాడారు. ఒరా రమేష్‌, మేకల అభిషేక్‌, గోవాడ విక్కీ, మేడిపల్లి సాయి సందీప్‌, గొరిముచ్చు ప్రవీణ్‌, పరిశె ఆదిలక్ష్మి, మద్దాల చంటి, డమాల కేసులమ్మ తదితరులు పాల్గొన్నారు.
తపాలా ఉద్యోగుల సంఘం సంపూర్ణ మద్దతు
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమనికి ఆంధ్ర రాష్ట్ర తపాలా ఉద్యోగుల సమన్వయ సమితి సంపూర్ణ మద్దతు తెలియచేస్తుందని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.శ్రీధర్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. లాభాల బాటలో పయనిస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రయివేటు వ్యక్తులకు అప్పచెప్పడం సరైనది కాదని పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వానికి పెద్ద స్థాయిలో లాభాలను ఆర్జించిపెడుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టిన రూ.4,898 కోట్లకు గాను పన్నులు, డివిడెంట్లు రూపంలో రూ.40వేల కోట్లను విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కేంద్ర ప్రభుత్వానికి సమకూర్చిందన్నారు. రూ.7977 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించిందన్నారు. ప్లాంటు విస్తరణ అప్పులకు రూ.18 వేల కోట్లను చెల్లించిందని గుర్తుచేశారు. గత డిసెంబరు నెలలో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ పనితీరు గమనిస్తే లాభదాయకంగా నడపడం సాధ్యమేనని రుజువైందన్నారు. 2020 డిసెంబరులో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ 98 శాతం ఉత్పత్తితో పనిచేసే రూ.2100 కోట్ల టర్నోవర్‌ను, రూ.170 కోట్ల నికర లాభాన్ని ఆర్జించించిందని గుర్తుచేశారు.
పన్ను చెల్లింపుదారులందరూ పాల్గొనాలి : టాక్స్‌ పేయర్స్‌
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం ఇప్పటికే ఉద్యమాలు ప్రారంభమయ్యాయని, ఈపోరాటంలో విజయవాడ నగరంలోని పన్ను చెల్లింపుదారులందరూ పాల్గొనాలని టాక్స్‌ పేయర్స్‌ అఓసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు వి.సాంబిరెడ్డి, ఎం.వి. ఆంజనేయులు కోరారు. విజయవాడ కస్తూరిభాయిపేటలోని బెల్లపు శోభనాద్రి గ్రంథాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.