Mar 02,2021 22:40

మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర నాయకులు జి.ఓబులు

ప్రజాశక్తి-హిందూపురం    విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వ్యూహాత్మక అమ్మకానికి పెట్టాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించడం ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక ప్రగతికి మరణ శాసనం వంటిదని, దానిని కాపాడుకునేందుకు ఐక్యంగా ఉద్యమిద్దామని సిఐటియు రాష్ట్ర నాయకులు జి.ఓబులు పిలుపునిచ్చారు. ఇందుకోసం 5న జరిగే రాష్ట్ర బంద్‌ను ఐక్యంగా కలిసి విజయవంతం చేద్దామన్నారు. మంగవారం సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలోని అఖిలపక్ష కార్యాలయంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి ఈఎస్‌ వెంకటేష్‌ అధ్యక్షత వహించారు. ముఖ్య అథితిగా జి.ఓబులు హాజరై మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు.ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో యావత్‌ తెలుగు ప్రజలు పోరాడి 32 మంది యువ కిశోరాల బలి దానంతో సాధించుకున్న స్టీల్‌ ప్లాంట్‌ను మోడీ ప్రభుత్వం ప్రయివేటుకు కట్టబెట్టాలని నిర్ణయించడం బరితెగింపేనని అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంటు ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని కేంద్ర మంత్రులు మొదలు బిజెపి స్థానిక నాయకులు ఇప్పటివరకూ జనానికి చెబుతూ వచ్చారన్నారు. ఇప్పుడు గంపగుత్తగా అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించడం పెద్ద మోసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీల్లో కీలకమైన కడప ఉక్కు ఫ్యాక్టరీకి మొండిచెయ్యి చూపి, ఉన్న ఒక్క ప్రభుత్వరంగ ప్లాంటును ప్రైవేటుకు తెగనమ్మడానికి పూనుకోవడం ఈ రాష్ట్రానికి బిజెపి చేసిన మరో ద్రోహం అన్నారు. 22 వేల ఎకరాల్లో ఉన్న ఉక్కు పరిశ్రమకు రూ.12,500 కోట్లు అప్పులు కట్టలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందంటే సిగ్గుచేటు అన్నారు. విశాఖ ఉక్కు, కడప ఉక్కు పరిశ్రమ ఆంధ్రకు రెండూ కళ్లు అని, వాటిని సాధించు కోవాడానికి అందరం కలిసి ఐక్యంగా ఉద్యమిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు దక్ష్మిణ ప్రాంత జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకటేష్‌, అధ్యక్షులు జెడ్‌పి శ్రీనివాసులు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి, ఆర్‌సిపి జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, బిఎస్‌సి శ్రీరాములు, గ్రిల్‌ వర్కర్‌ యూనియన్‌ అధ్యక్షులు జబీవుల్లా, ప్రికాట్‌ మిల్లు నాయకులు సదాశివారెడ్డి, ఎంఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి రవి, ఎపిఎస్‌ఎఫ్‌ అభి, నాగభూషణ, ఎన్‌ఎస్‌యుఐ సంపత్‌, సిఐటియు నాయకులు నరసింహ, ఎన్‌.వి.రమణ, మల్లికార్జున, ఆనంద్‌, రవి, గురునాథ్‌, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
గుంతకల్లు : విశాఖ ఉక్కు పరిరక్షణకై వామపక్ష పార్టీల పిలుపు మేరకు ఈ నెల 5వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి.శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక హంపిరెడ్డి భవనంలో వామపక్ష పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.శ్రీనివాసులు, సిపిఐ పట్టణ కార్యదర్శి వీరభద్రస్వామి, సిపిఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు బి.సురేష్‌ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఎంతోమంది ప్రాణ త్యాగం ఫలితంగా, కమ్యూనిస్టులు పోరాట ఫలితంగా విశాఖలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకున్నామన్నారు. బీజేపీ ప్రభుత్వం స్టీల్‌ ప్లాంట్‌ను బడా పెట్టుబడిదారీ సంస్థలకు దారాదత్తం చేస్తోందన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలు బంద్‌లో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సమావేశంలో ఎఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి బి.మహేష్‌, సిఐటియు పట్టణ కార్యదర్శి మారుతీ ప్రసాద్‌, ఐఎఫ్‌ టియు నాయకులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.