Mar 05,2021 19:32

విశాఖ : గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జివిఎంసి) ఎన్నికల్లో భాగంగా మేయర్‌ అభ్యర్థిని టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించారు. జివిఎంసి ఎన్నికల్లో భాగంగా శుక్రవారం విశాఖలోని పెందుర్తి కూడలిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జివిఎంసి మేయర్‌ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును ప్రకటించారు. ప్రచారంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జివిఎంసి ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడం ఖాయమన్నారు. టిడిపి విజయాన్ని అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదని అన్నారు. ఎన్నికల్లో టిడిపికి అఖండ విజయం అందించాలని ప్రజలను కోరారు. ఉమ్మడి ఎపిలో సిఎం ఉన్న తొమ్మిదేళ్లలో విశాఖను ఆర్థిక రాజధానికి చేయాలని ఎంతో కృషి చేశానని, హుద్‌హుద్‌ తుఫాను వచ్చినప్పుడు విశాఖలోనే 10 రోజులు ఉండి ప్రజల బాగు కోసం కష్టపడ్డానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఎంపి కేశినేని కూతురు కేశినేని స్వేతను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.