Nov 25,2021 13:04

విశాఖ : ఎపిలో అతిపెద్ద నగరం విశాఖ. సుందరమైన సముద్ర తీరం, ఆహ్లాదకరమైన కొండలతో, అద్భుతమైన అరకు లోయ, మన్యం అడవుల సౌందర్యంతో అలరారుతుంటుంది. పర్యాటక ప్రాంతమయిన ఈ విశాఖ అందాలను చూసేందుకు, సెలవులను సంతోషంగా గడిపేందుకు యాత్రికులు నిరంతరం వస్తూనే ఉంటారు. విశాఖ పర్యాటకులకు మరింత సౌకర్యాన్ని కలిగించేందుకు రైల్వే శాఖ సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది.

విశాఖ అందాలను చూడటానికి విజయవాడ, హైదరాబాద్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ నుంచి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. నగరంలోని రామకఅష్ణ, రుషికొండ, యారాడ బీచ్‌లు, కైలాసగిరి, టియు-142 ఎయిర్‌క్రాఫ్ట్‌ మ్యూజియం, సబ్‌మెరైన్‌ మ్యూజియం, జూపార్క్‌ సహా సింహాచలం, తొట్లకుండ, బావికొండ లాంటి ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఆంధ్రా ఊటీ అరకుతో పాటు లంబసింగి వంజంగి లాంటి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడతారు.

'మిస్టర్‌ బైక్స్‌' పేరిట బైక్‌, కార్‌ సర్వీసులు..
నచ్చిన ప్రాంతాలను చూడటానికి వెళ్లేటప్పుడు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలను వీక్షించడానికి యాత్రికులు నిత్యం ఆటో, ట్యాక్సీ, బస్సులను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఇక మీదట ఆ ఇబ్బంది లేకుండా.. రైల్వే శాఖ అధికారులు విశాఖ పర్యాటకుల సమస్యకు చెక్‌ పెట్టారు. నగర సందర్శనకు వచ్చేవారి కోసం రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలోనే రకరకాల బైక్‌లు, కార్లు అద్దెకు తీసుకునే వీలు కల్పించారు. వాల్తేరు డివిజన్‌ రైల్వే అధికారులు 'మిస్టర్‌ బైక్స్‌' పేరిట బైక్‌, కార్‌ సర్వీసులను ఏర్పాటు చేశారు. విశాఖ రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం వద్ద ఎలక్ట్రికల్‌ పెట్రోలు వాహనాలు అందుబాటులో ఉంటాయి. వాటి రకం మేరకు ధరలు నిర్ణయించారు.

ఆన్‌లైన్‌ బుకింగ్‌ వీలు.. రేట్లు ఇలా..
పెట్రోల్‌ తో నడిచే స్కూటీ తరహా వాహనానికి రోజుకు రూ.500, బైక్‌ లకు రూ.600 నుండి రూ.1200 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్‌, ఒరిజినల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ సమర్పించి అద్దెకు వాహనాన్ని పొందవచ్చు. నచ్చిన వాహనం కోసం వారం రోజుల ముందు ఆన్‌ లైన్‌లో బుక్‌ చేసుకునే సదుపాయం కూడా ఉంది.

'మిస్టర్‌ బైక్స్‌' నిర్వాహకులు మాట్లాడుతూ... పర్యాటకుల కోసం రెండు వందలకుపైగా బైక్‌లు, పదుల సంఖ్యలో కార్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. వినియోగదారులకు ఇచ్చే వాహనాలకు.. ఎక్కడికైనా సులువుగా చేరుకునేందుకు వీలుగా జిపిఎస్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ ఉంటుందని చెప్పారు. రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో ఈ సదుపాయం ఉండటం పట్ల పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. యువతకు ఈ వాహనాలు చాలా ఉపయోగపడుతున్నాయని తెలిపారు.