Nov 19,2020 06:27

సీతాకోక చిలుకల్లా
రూపాంతరం చెందని
గొంగళి పురుగులు వాళ్ళు
పంచభక్ష్య పరమాన్నం దొరికినా
అర్థాకలికి అలవాటుపడ్డ కడుపులకి
అజీర్తి చేస్తుందేమోనని
కడుపారా ఆరగించలేని
అల్ప జీవులు వాళ్ళు
పున్నమిలెన్నొచ్చినా
వెన్నెల ముఖం చూడని
అమావాస్య చీకట్లు వాళ్ళు
తెల్లారి లేవంగానే
రెక్కలమ్ముకోడానికి
బజారునపడ్డ కల్మషమెరుగని
మంచి మనుషులు వాళ్ళు
స్వేదపు సుగంధాల్నే
శ్వాసిస్తూ
మారని వాళ్ళ జీవితాల్ని
వాళ్లే శాసిస్తూ
తమ తల రాతల్ని
తామే మార్చుకోవడాన్కి
తరతరాలుగా అలుపెరుగక
ప్రయత్నాలు చేస్తూ
విఫలమవుతున్న
విధాతలు వాళ్ళు.
                       - యం.యస్‌. రాజు, సెల్‌ : 95020 32666