
ప్రజాశక్తి అమరావతి బ్యూరో : తుపాను విపత్తు పరిహారాన్ని వెంటనే చెల్లించాలని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. నివర్ తుపాను ప్రాంతాల టిడిపి నాయకులతో చంద్రబాబు ఆదివారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నివర్ తుపాను వల్ల 114 నియోజకవర్గాల్లో 12 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. జరిగిన పంట, ఆస్తి నష్టాలతోపాటు దెబ్బతిన్న ఇళ్లు, మరణించిన మూగజీవాల వివరాలను వీడియోలు, ఫొటోలు, తీసి 7557557744 నెంబరకు వాట్సాప్ ద్వారా పంపాలని టిడిపి శ్రేణులను కోరారు. ఇప్పటికే టిడిపి ప్రతినిధులు 18 బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని తుపాను నివేదికలను వారితో తెప్పించుకుని అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని చెప్పారు. ఈ ఖరీఫ్‌లోనే ఏడు విపత్తులు వచ్చాయని, మొత్తం 20లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని గుర్తు చేశారు. గాలిలో తిరగడం, గాలి కబుర్లు చెప్పడం తప్ప జగన్మోహన్రెడ్డి చేసిందేమీ లేదన్నారు. భారీ వర్షాల వల్ల వేలకోట్లు నష్టం జరిగితే రూ.200 కోట్లు మంజూరు చేసి, వాటిని కూడా రైతుల ఖాతాల్లో జమ చేయకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. టిడిపి హయాంలో ఎలాంటి వరదలు, తుపానులు వచ్చినా ప్రజలకు ముందస్తు సమాచారం ఇచ్చి నష్ట శాతాన్ని తగ్గేలా చేశామని వైసిపి ప్రభుత్వం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసిందని చంద్రబాబు విమర్శించారు.