Feb 22,2021 07:24

కాలప్రవాహంతో పాటూ జీవితాలు అతి మామూలుగా సాగిపోతున్నాయి, సంవత్సరాలు సాఫీగా దొర్లిపోతున్నాయి. ఇంతలో గుర్తుంచుకోగలిగే ఆకర్షణీయమైన అంకెతో వచ్చే కొత్త సంవత్సరం కోసం అందరూ వేచి చూశారు.. అదే 2020. కానీ కొత్త సంవత్సరం వస్తూనే భూగోళాన్ని వణికించే ఒక విపత్తును తెచ్చి నిజంగానే కలకాలం గుర్తుండిపోయేంత ముద్ర వేసింది. అందరికీ బేడీలు బిగించి ఇళ్ళలో కూర్చోబెట్టి ఊపిరాడకుండా చేసింది. ఎక్కడి పనులక్కడ స్తంభించిపోయాయి. వ్యాపారాలు మూతపడ్డాయి. కానీ సాహిత్యాభిలాషులు మాత్రం సమయం చిక్కక పక్కన పడేసిన పుస్తకాలు తెరిచారు. కలాలు కదిలించారు. విపత్తును కథల్లో, కవితల్లో బంధించారు, రికార్డు చేశారు.


అదే సమయంలో విశాలాక్షి మాసపత్రిక కథల పోటీతో ముందుకు వచ్చింది. దానితో పాటు బహుమతి కథలతో సంకలనం వేయడానికి నడుం కట్టింది. ఈ పోటీకి బహుమతులు అందించి ప్రోత్సహించిన రచయిత్రి వంజారి రోహిణి గారిని, పబ్లిషర్‌ కోసూరు రత్నం గారిని, విశాలాక్షి సంపాదకులు ఈతకోట సుబ్బారావు గారిని ప్రత్యేకంగా అభినందించాలి. ఈ పోటీలో సుమారు 350 కథలతో కొత్త రచయితలతో పాటు చేయి తిరిగిన రచయితలు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందించదగ్గ విషయం.


ఐదు వేల రూపాయల చొప్పున బహుమతులు గెలుచుకున్న ఏడు మేటి కథలు వేటికవే విభిన్నమైన కథనంతో ఆకట్టుకున్నాయి. సంపుటిలోని మిగిలిన కథలు కూడా బహుమతి కథలకు ఏ మాత్రం తీసిపోకుండానే ఉన్నాయి. సంపుటిలోని మొదటి కథ అయిన ముసునూరి సుబ్బయ్యగారి కథ ''పరిహారం''. జీవిక కోసం కప్పలు పట్టుకుని బతికే వ్యక్తుల గురించిన కథనంతో ఆసక్తిగా ముందుకు సాగింది. ఇటువంటి ఇతివృత్తంపై బహుశా ఇంతకు ముందు ఎవరూ రాసినట్టులేరని అనిపిస్తోంది. సీనియర్‌ రచయిత సింహప్రసాద్‌ గారి కథ ''కాశీపట్నం చూడర బాబూ''. వయసు మీద పడ్డా డబ్బు మీద ఇచ్ఛ చావని పెద్దావిడ తాలూకు కాశీలో అనుభవాలను కళ్ళక్కడుతుంది. రచయిత కాశీలోని వీధివీధిని కథలో దర్శింపజేసారు. కథ తాత్విక ధోరణితో సాగి చివర వరకూ చదివిస్తుంది. ''అన్‌ డూ'' అనే ఒక సరికొత్త కథనంతో నండూరి సుందరి నాగమణి గారు నేటి తరం భార్యాభర్తల మధ్య ఏర్పడ్డ స్పర్ధను, దానిని వారు ఏ రకంగా పరిష్కరించుకున్నారో చక్కగా చిత్రీకరించారు. దాట్ల దేవదానంరాజు గారు ''పులస'' కథను అల్లుతూ మనలను గోదావరి ఒడ్డుకు తీసుకుపోతారు. మధ్య తరగతి చిన్న కోరికలను కలలను, పులస పులుసుకు ముడేసి కథను చక్కగా నడిపించారు. చివరగా కథలోని పాత్రకు ఆ చిరు కోరిక తీరిందా లేదా అని తెలుసుకోవాలంటే కథ చదివి తెలుసుకోక తప్పదు. డా. రమణ యశస్వి గారు అమ్మ ఉన్న ఒక అందమైన ఇంటిలోకి మనలను తీసుకెడతారు. ఒక పెద్దావిడ సెల్‌ఫోన్‌ను ఉపయోగించటం నేర్చుకోవడం, మనుమలతో ఆవిడకున్న అనుబంధం ''అమ్మ ఉన్న ఇల్లు'' అనే ఈ కథలో చక్కగా వివరించారు. ఇది ఒక ఫీల్‌ గుడ్‌ కథ. చిత్తలూరి గారు రాసిన ''వానకు తడిసిన పాత గోడ'' కవితాత్మకంగా సాగింది. స్వతహాగా కవి అయిన చిత్తలూరి కరోనా లాక్‌డౌన్‌ సమయంలో పిల్లలు లేని బడి పసి అడుగుజాడల కోసం అల్లాడుతూ ఎలా బావురుమందో కథగా చెప్పారు. మరో బహుమతి కథ అంబల్ల జనార్ధన్‌ గారి ''ఇంటి పేరు''. స్త్రీవాద దిశగా ప్రయాణించింది. తర్కాలకు ఆచారాలకు నడుమ జరిగిన సంఘర్షణను చిత్రించింది. ఇది ఒక ఆలోచింపజేసే కథ.


సీనియర్‌ కవి రచయిత ఎమ్వీ రామిరెడ్డి గారు ''మధ్యాహ్నం మరగ్గాసిన పొంతకాగులా ఉంది'' అనే కవితాత్మక వాక్యంతో కథను ఆరంభించి మనలను ఒక వేడివేడి వాతావరణంలోకి తీసుకెడతారు. ఈ కథ చదివాక ఎవరికైనా ''గుండె చెరువు'' అవక తప్పదు. రియల్‌ ఎస్టేట్లు, డెవలెప్‌మెంట్లు అంటూ వేలం వెర్రిగా పరుగులు తీసి భూమితల్లిని ముక్కలు చెక్కలు చేసి అమ్ముకుంటూ మన గోతులు మనమే ఎలా తవ్వుకుంటున్నామో చెప్తారు. ఇటువంటి కథల వల్లైనా మనకు కనువిప్పు కలగాలి. ఈతకోట సుబ్బారావు గారి చారిత్రాత్మిక కథ ''వీరుల దిబ్బ'' ఆద్యంతం ఆసక్తిగా చదివిస్తుంది. కథలో యుద్ధరంగాన్ని చూపిస్తూ చాలా అందంగా మలచారు. ఈ రచయిత కవి కూడా కావడం వల్ల కథనం పండింది. సత్యాజీ గారి ''ఊరికి ప్రయాణం'' నోస్టాల్జిక్‌ కథ. చదువుతున్నంతసేపు మన ఊరి జ్ఞాపకాలు మనసులో కదలాడుతూనే ఉంటాయి. తండ్రీకొడుకుల నడుమ సంభాషణలు చాలా చక్కగా అలరిస్తాయి. మంచికంటి గారు ఒక అమ్మాయి జీవితపు చేదును, ఆమెతో సమాజం నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించిన తీరును ''బతుకాట''గా మలచారు. అమ్మాయి నోటనే పలికించిన ఈ కథ ఒక ద్ణుఖగీతం. సీనియర్‌ కథకులు వల్లూరు శివప్రసాద్‌ గారి కథ నిజంగా ''అమూల్యం''. నేటి మన నిర్లక్ష్యం వల్ల భవిష్యత్తులో ఏర్పడే తీవ్ర పరిణామాలను గురించిన హెచ్చరిక ఈ కథ. చదివి తప్పకుండా ఆలోచించాల్సిన కథ. సుప్రసిద్ధ రచయిత్రి కామేశ్వరి గారి కథ నేటి రైతుల ద్ణుఖాన్ని గురించి చెప్తుంది. అటువంటి కొన్ని కన్నీటిబొట్లైనా తుడవడానికి ఒక పెద్దావిడ చేసిన చిన్న ప్రయత్నాన్ని కూడా చెప్తుంది. మరో సుప్రసిద్ధ రచయిత విహారిగారి కథ ''క్రీనీడలు'' చివరివరకు చక్కగా చదివింపజేస్తుంది. ఆదర్శానికి, నిజ జీవితానికి నడుమ సంఘర్షణను చిత్రీకరించారు ఆయన. చివరకు ఏం జరిగిందో కథ చదివి తెలుసుకోవలసిందే. పసుపులేటి సత్యవేణిగారి కథ ''ఎల్‌ఓసి'' దేశభక్తి కథ. ఉత్కంఠభరితంగా సాగుతూ ఆసక్తిని కలగజేస్తుంది. సున్నితంగా కథలు స్పృశించే సి.యమున గారు ''చిగురాకులలో చిలకమ్మా'' కథను శీర్షికతో భళా అనిపించారు. నేటి తరపు యువజంట నడుమ ఏర్పడ్డ సన్నటిపొర గురించి కథను అల్లి మాటల విలువను తెలియజెప్పారు.


సుంకోజి దేవేంద్రాచారి గారి ''మనసైన దారి'' ఇంటి ఇల్లాళ్ళ కనబడని చాకిరిని, విలువను తెలియజెప్పే చక్కని కథ. ''మూసిన తలుపు'' అనేది గొర్లి శ్రీనివాస్‌ గారి కథ. మనం చేసిన మంచి ఎక్కడికీ పోదని, అన్ని తలుపులూ మూసుకున్నపుడు ఏదో ఒక తలుపు తప్పక తెరుచుకుంటుందనే ఆశావహ దక్పథాన్ని పెంపొందించే కథ. నవ్వుల రచయిత కోనే నాగ ఆంజనేయులు గారి కథ ''అమ్మాయి పెళ్ళి'' కూడా మంచి కథ. సాహితీసేవలో నిత్యం పాల్గొనే కవి, రచయిత డా.మక్కెన శ్రీను గారి ''దేశభుక్తి'' ఆలోచింపజేసే కథ. 'అందరూ ఉద్యోగాలంటూ పరుగులు తీస్తుంటే మనకి అన్నం పెట్టే వారెవరు, తిండి గింజలను పండించే వారెవరు'. దేశభక్తిని చూపడానికి సైనికులే కానక్కరలేదు, దేశప్రగతి కోసం మన వంతుగా ఏ కొంత పాటుపడినా చాలు అంటారు ఈ రచయిత. గండ్రకోట సూర్యనారాయణ గారు జీవితాన్నీ లెక్కలను సమన్వయం చేస్తూ ఒక ''లెక్కల టీచర్‌'' కథ చెప్పారు. కవి రచయిత అయిన దేశరాజు గారు ధర్డ్‌ జెండర్‌ వారి బాధామయ జీవితాన్ని ''మరో ప్రపంచం'' అంటూ చూపించారు. తల్లిదండ్రులు అటువంటి వారి పట్ల అవగాహనతో వ్యవహరించి ధైర్యాన్ని నూరిపోయాలనే సందేశాన్ని ఇచ్చారు. ''ఉగ్గు వెట్టరే ఓయమ్మా'' అంటూ అన్నమయ్య పాటలోని చిన్న భాగాన్ని కథాశీర్షికగా పెట్టడం మనోహర్‌ కోటకొండ గారి అందమైన ఆలోచన. మాతృభాష గొప్పదనాన్ని గురించి చెబుతూ అంతే అందంగా అల్లిన కథ. ''మాతృభాషకు ఇతర భాషలు గడ్డిపోచతో సమానం'' అంటూ గడ్డిపోచను పట్టుకుని చెప్పిన తేటతెలుగులాంటి తియ్యని కథ. పి.వి.బి.రామ్మూర్తి గారి ''అదే దారి'', మనతో పాటు 'అందరూ బాగుండాలి' అని చెప్పే మంచి కథ. నేటి విద్యావిధానంలోని డొల్లతనాన్ని నిరసిస్తూ అమర్‌ గారు రాసిన కథ ''హేట్‌ స్టోరీ''. ఒక మనిషి పేరు చివర తగిలించుకున్న డిగ్రీలకూ, అతడి వ్యక్తిత్వానికీ సంబంధముండదు అని కుండబద్దలు కొట్టిన మంచి కథ. చివరలో ఈ నేపధ్యంతో తెరకెక్కిన ''తారే జమీన్‌ పర్‌'' అమీర్‌ఖాన్‌ గారికి కథను అంకితమివ్వడం రచయిత మంచి మనసు. వంజారి రోహిణి గారి కథ సైకాలజీ నేపధ్యంతో రాసిన కథ. ''దమనం'' శీర్షికతో ఆసక్తిని రేకెత్తించే మంచి కథ. అదేమిటో తెలుసుకోవడానికి పాఠకులు కథ శ్రద్ధగా చదవాలి. బుద్ధవరపు కామేశ్వరరావు గారి ''కష్టం విలువ'' కరోనా లాక్‌డౌన్‌ సమయంలో చెయ్యడానికి పనులు లేక ఆకలికి అల్లాడిన పేద బతుకులను చిత్రించిన కథ. కథను పాజిటివ్‌గా ముగించడం కూడా బావుంది.


ఇక ఈ 28 కథలహారం సామాజిక స్పహల చారిత్రాత్మిక సాంఘిక ఆర్ద్ర కథల సమాహారం. ప్రతి కథ కింద రచయిత పరిచయం ఇవ్వడం కూడా బావుంది. ఇది వంజారి రోహిణి, ఈతకోట సుబ్బారావు, కోసూరు రత్నం గార్ల సమిష్టి కృషి. బాలిగారి కుంచె నుంచి జాలువాలిన అందమైన ముఖచిత్రంతో కథలసంపుటి ఆకర్షణీయంగా ముస్తాబైంది. ఈ విశాలాక్షి కథలు మీ ఇంటి లైబ్రరీలో తప్పక ఉండాల్సిన పుస్తకం. విశాలాక్షి బహుమతి కథల సంపుటి కోసం 94405 29785 ఫోన్‌ నెంబరులో సంప్రదించండి.
                                                      * పద్మావతి రాంభక్త, 99663 07777