Nov 27,2020 16:16

విజయనగరం టౌన్‌ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక మూడు చట్టలను రద్దు చేయాలని, స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా మద్దతు ధర చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ దేశ వ్యాప్తంగా 500కి పైగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లా ప్రధాన తపాలా కార్యాలయం వద్ద రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అదే సమయంలో బాలాజీ జంక్షన్‌ నుంచి గంటస్తంభానికి వెళ్లే రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి, రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుందని ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి.రాంబాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టివి.రమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరావు, కౌలు రైతు సంఘం నాయకులు రాకోటి రాములు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.సురేష్‌ను అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్‌కి తరలించారు. అంతకు ముందు కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రైతులను బిక్షగాళ్లను చేసే విధంగా మూడు చట్టాలను చేసిందన్నారు. నూతన వ్యవసాయ చట్టంలో దేశంలో రైతు పంటను ఎక్కడైనా అమ్ముకోవచని చెప్పి దోపిడిదార్లు, పెట్టుబడుదార్లుకు ఉపయోగపడే విధంగా చట్టం చేసిందన్నారు. రైతు పండించే పంటకు ధరను నిర్ణయించే అవకాశం చట్టం ద్వారా పెట్టుబడుదార్లకు అప్పగించారన్నారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా గిట్టుబాటు ధరను నిర్ణయించకుండా కేంద్రం రైతులను మోసం చేస్తుందన్నారు. నిత్యావసర చట్టాన్ని ఎత్తేసి పెద్ద పంటలను సైతం నిల్వచేసుకునే విధంగా చట్టం చేయడం వల్ల రైతుకు గిట్టుబాటు ధర కూడా రాకుండా చేస్తుందన్నారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌ రైతులు చలో ఢిల్లీ వెళ్తే వారిపై లాఠీచార్జి చేసి అమానుషంగా పోలీసులు దాడి చేయడం దారుణమన్నారు. తక్షణమే రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి.అప్పలసూరి, మెడికల్‌ రిప్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి యూఎస్‌.రవికుమార్‌, సిఐటియు నాయకులు బి.రమణ, ఏ.జగన్మోహన్‌, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లోకవరపు ఆదినారాయణ, జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌.శ్రీరామ్మూర్తి, కౌలు రైతు సంగం నాయకులు వై.లింగరావు, రైతు సంఘం సిహెచ్‌.పెంటయ్య, బంగారియ్య, సూరిదేముడు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.రామ్మోహన్‌, నాయకులు రాము, హర్ష, రామకృష్ణ, రైతులు, తదితరులు పాల్గొన్నారు.