Sep 28,2020 17:15

వీటితో పర్యావరణానికి చేటు!

పర్యావరణ మార్పుతో సంభవిస్తున్న విపరీత పరిణామాలు మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ఈ చైతన్యం నలుమూలలకూ చేరడానికి సామాజిక మాధ్యమాల ద్వారా చేపట్టిన ప్రచారం ఎంతో ఫలితాన్ని ఇచ్చింది. ఒక విధంగా సోషల్‌ మీడియా వల్లనే పర్యావరణ పరిరక్షణపై అవగాహన మరింత మెరుగుపడిందనే మాట వాస్తవం. అయితే నేటి ప్రజాజీవితంలో సాధారణంగా మారిన సామాజిక మాధ్యమాల వినియోగంతో పర్యావరణానికి నష్టం వాటిల్లనుందా?!
తెల్లారి లేచిన దగ్గర నుంచి తిరిగి మనతో పడక పంచుకునేవరకూ మన జీవితాన్ని ముడిపెట్టుకున్న సామాజిక మాధ్యమాలు మనల్నే కబళిస్తాయని ఊహించగలమా? మనం వాడుతున్న యాప్‌లు, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, స్నాప్‌చాట్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి వెబ్‌సైట్లు భౌతిక వస్తువులు కాదు నిజమే. మరి పర్యావరణానికి ఇవెలా హాని చేస్తాయనే సందేహం కొందరిలో ఉండొచ్చు. అయితే సామాజిక మాధ్యమాలు చాప కింద నీరులాంటివి. చాలామంది వాటికి బానిసలయ్యారనే విషయం వారికే తెలియనంతగా అవి మనల్ని ఆకర్షిస్తాయి. ఎంతగా అంటే సామాజిక మాధ్యమాలను వినియోగించొద్దని పెద్దలు మందలిస్తే ఆత్మహత్య చేసుకునేంతగా అవి జీవితాలను లొంగదీసుకున్నాయి. ఇదంతా మానసిక సంబంధిత విషయం కదా! దీనికీ పర్యావరణ హానికి సంబంధం ఉండదనుకోకండి! సామాజిక మాధ్యమాలు పర్యావరణంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి మనం నాణేనికి రెండు వైపులా చూడాల్సి ఉంటుంది.
విద్యుత్‌ వాడకం
నిత్యావసర వస్తువుల్లా మన రోజువారీ జీవితంలో సామాజిక మాధ్యమాలు భాగమయ్యాయి. కాబట్టి వాటిని వినియోగించడానికి స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్ల వంటి డివైజ్‌ల వాడకమూ పెరుగుతుంది. అలాగే సామాజిక మాధ్యమ వేదికలను సదరు డివైజ్‌ల వరకూ తీసుకురావడానికి కావాల్సిన డేటా సెంటర్లు, ఇంటర్నెట్‌ రూటర్లు, బేస్‌ స్టేషన్లు వగైరా వగైరా సౌకర్యాల స్థాపన అవసరమవుతుంది. ఇలా ప్రతి అడుగులోనూ వాటికోసం మనం విద్యుత్తును వినియోగించాల్సి వస్తుంది. ఇప్పటికే పెరిగిపోతున్న భూతాపాన్ని నియత్రించడానికి ప్రతి చిన్న విషయాన్నీ దృష్టిలో ఉంచుకోవాలని ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. అందుకే ఇంట్లో వాడుకునే ఎయిర్‌ కండిషీనర్‌ వంటి పరికరాల్లో ఉష్టోగ్రతలనూ నియంత్రించే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. సాంప్రదాj విద్యుత్‌ ఉత్పత్తి వల్ల కలిగే నష్టాలను గుర్తించి, సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనిషికి రెండు మూడు సిమ్‌లతో కూడిన ఫోన్లు, వాటితో పాటు వివిధ సామాజిక మాధ్యమాల్లో ఉన్న వివిధ అకౌంట్లు, వాటికి వినియోగించే విద్యుత్‌ ఖర్చు... ఇలా ప్రతి సూక్ష్మమైన విషయాన్ని పరిశీలించినపుడు మనం ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఊగిసలాడుతున్నామో అర్థమవుతుంది. విద్యుత్తు పరికరాలకు, డేటా సెంటర్లకు మరింత విద్యుత్తు అవసరమవుతుంది. వీటి వినియోగంలో ఎంతో వేడి పుడుతుంది. ఆ వేడిని తగ్గించి, పని సవ్యంగా నడవడానికి అక్కడ ఎంతో చల్లదనం అవసరం. దానికి మరలా ఎయిర్‌ కండీషనర్‌ అవసరం. అంతేనా ఈ డివైజ్‌లను తయారుచేయడానికి లోహం అవసరం. దానికి మైనింగ్‌ చెయ్యాలి. అంతటితో ఆగుతుందా? అందులో హానికారక రసాయనాల వినియోగం చాలానే ఉంటుంది. ఇలా ప్రతి నేపధ్యాన్ని తవ్వి చూస్తే సామాజిక మాధ్యమాల వినియోగం పెరగడంతో పాటు దాని వెనుక జరుగుతున్న తంతు అంతా బోధపడుతుంది.
ఏది మరింత చేటు?
సామాజిక మాధ్యమాలను అసలు వాడకుండా ఉండటం అసాధ్యమని చాలామంది అభిప్రాయపడవచ్చు. అలాగే ఉన్నవాటిలో భూమికి తక్కువ హాని చేసేది ఏమైనా ఉందా? అనే సందేహమూ రావచ్చు. అంటే స్నాప్‌చాట్‌ కంటే ఫేస్‌బుక్‌ భూమికి ఎక్కువ హాని చేస్తుందా? లేదంటే ట్విట్టర్‌ కంటే ఇన్‌స్టాగ్రామ్‌ పర్లేదా వంటివి. సాధారణంగా చూస్తే ఎక్కడ ఎక్కువ డేటా వినియోగించబడుతుందో అక్కడ పర్యావరణంపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. అంటే ఫొటోలు షేర్‌ చేయడం కంటే టెక్స్ట్‌ మెసేజ్‌లకు తక్కువ డేటా ఖర్చు అవుతుంది. అలాగే ఫొటోల కంటే వీడియోలకు ఎక్కువ డేటా వాడాలి. అందుకే మనం వినియోగించే వేదికల ప్రభావం మనం షేర్‌ చేసే దాన్నిబట్టి, డౌన్‌లోడ్‌ చేసుకునే దాన్నిబట్టి ఆధారపడి ఉంటుంది. దీనిద్వారా అత్యంత ఎక్కువగా వీడియోల షేర్‌ కలిగి ఉన్న 'ఫేస్‌బుక్‌' పర్యావరణానికి ఎక్కువ హాని చేస్తున్నట్లు కార్పొరేట్‌ కర్బనాన్ని కొలిచే 'ది కార్బన్‌ ట్రస్ట్‌' అనే ఏజెన్సీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతెందుకు ఎనిమిదేళ్ల క్రితమే, స్వయంగా ఫేస్‌బుక్‌ యాజమాన్యం తమ కార్యకలాపాల వల్ల 2,85,000 మెట్రిక్‌ టన్నుల కర్బన ఉద్గారాలు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అప్పటికే ఇది గూగుల్‌ కంటే అధిక శాతం కూడా.
మనమే పూనుకోవాలి!
సామాజిక మాధ్యమాల పనితీరును నియంత్రించడానికి పెద్దపెద్ద కార్పొరేట్‌ కంపెనీలు పూనుకోవాలి. కానీ లాభాపేక్షే మూలధనంగా భావించే వీళ్లు ఈ దిశగా ముందడుగా వేయగలరా అనేదే అనుమానం. ఇక ప్రజలంతా కలిసి పర్యావరణ పరిరక్షణకే ప్రాధాన్యత ఇస్తే ఈ కంపెనీలు కర్బన ఉద్గారాలను తగ్గించక తప్పదు. అందులోనూ భారతదేశం 2,69,000,000 వినియోగదార్లతో ఫేస్‌బుక్‌ మార్కెట్లో అతిపెద్ద దేశంగా నిలిచింది. ఇది అమెరికా శాతం కంటే ఎక్కువ. కనుక మనం సరైన నిర్ణయం తీసుకోగలిగితే మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని మనమే సంరక్షించుకోగలము.