Nov 29,2020 22:11

ప్రజాశక్తి - విజయవాడ
అర్ధాంతరంగా నిర్మాణ పనులు ఆగిపోవడంతో విజయవాడ నగరపాలక సంస్థ నూతన భవనానికి ఎప్పుడు మోక్షం కలుగుతుందో ప్రశ్నార్ధకంగా మారింది. 2018లో నిలిచిపోయిన భవనం నిర్మాణ పనులకు ఏళ్లు గడుస్తున్నా నేటికీ అతీగతీలేకుండా పోయింది. ప్రభుత్వం మారినా నిర్మాణం మాత్రం ముందడుగు పడటంలేదు. రాష్ట్ర మున్సిపల్‌ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, నగరానికి చెందిన రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, సెంట్రల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇక ఆలస్యం చేయకుండా నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిందేనని అధికారులకు తెలిపినట్లు సమాచారం. 2016లో టిడిపి మేయర్‌ కోనేరు శ్రీధర్‌, అధికార పార్టీ కౌన్సిల్‌ సభ్యులు నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. నూతన భవనంలో కౌన్సిల్‌ నిర్వహణ, మేయర్‌, కమిషనర్‌ ఛాంబర్ల దగ్గర నుంచి ఇంజినీరింగ్‌, టౌన్‌ప్లానింగ్‌, ప్రజారోగ్యం తదితర అన్ని విభాగాలకు ఉపయోగపడే రీతిలో జి+9 భవనానికి డిజైన్‌ చేశారు. అప్పటి పాలకవర్గం జి+2 వరకు స్లాబ్‌ పనులను పూర్తి చేసింది. హైదరాబాద్‌కు చెందిన చాప్రాస్‌ అసోసియేట్స్‌ అనే ప్రయివేటు కంపెనీ కాంట్రాక్ట్‌ తీసుకొని పనులను మధ్యలోనే నిలిపివేసింది. అమరావతి డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎడిసి)లో విస్తరణలో భాగంగా ప్రకాశం బ్యారేజి దగ్గర నుంచి మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఏరియా, రాజీవ్‌గాంధీ పార్కు మధ్యలోని ఏరియా స్థలాన్ని అభివృద్ధి చేయాలనే ప్లాన్‌ ప్రకారం విఎంసి నూతన భవన నిర్మాణం అంశాన్ని అప్పటి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. భవన నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయి రెండున్నరేళ్లకు పైగా అవుతున్నా, ప్రభుత్వం మారినా దీనిని పూర్తి చేయాలనే దిశగా ఆలోచించడంలేదు. ఇప్పటి వరకు సుమారు రూ.10 కోట్ల వరకు పనులు జరిగితే రూ.8 కోట్ల వరకు బిల్లులు సదరు కాంట్రాక్టర్‌కు గత ప్రభుత్వంలోనే చెల్లింపులు జరిగాయి. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్క పని కూడా జరగలేదు. దీనిని పూర్తి చేయాలని మరలా ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం గ్రాంట్‌ నుంచి రూ.8 కోట్లు కేటాయించినట్లు విఎంసి ఇంజినీరింగ్‌ అధికారులు వివరిస్తున్నారు. ఇప్పుడున్న ధరల ప్రకారం రూ.20 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ఇంజినీర్ల అంచనా. ఈ క్రమంలో కాంట్రాక్టు కంపెనీ ఎంత వరకు పనులు చేయడానికి ముందుకు వస్తుందో ప్రశ్నార్ధకంగా తయారైంది.