Feb 28,2021 07:11

ప్రజాశక్తి- తిరుపతి సిటి : సంఘ్‌పరివార్‌ అజెండాను విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వం బలవంతంగా ప్రవేశపెడుతోందని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు విపి సాను విమర్శించారు. దీన్ని వ్యతిరేకించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు భయంతో అమలు పరుస్తున్నాయని అన్నారు. ప్రాంతీయ భాషలను అణగదొక్కేలా, ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసేలా నూతన విద్యావిధానం ఉందని పేర్కొన్నారు. రెండు రోజులపాటు జరిగే ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు చిత్తూరు జిల్లా తిరుపతిలోని రామతులసీ కల్యాణ మండపంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యారంగంపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. దేశవ్యాప్తంగా అశాస్త్రీయ విద్యా విధానం ప్రవేశ పెట్టడంలో భాగంగా నూతన జాతీయ విద్యావిధానం తీసుకొచ్చిందని విమర్శించారు. శాస్త్రీయ విద్య కోసం విద్యార్థులు సమరశీల పోరాటాలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఐఐటి, ఐఐఐటి, సెంట్రల్‌ యూనివర్సిటీ, ఐఐఎం, ఎయిమ్స్‌ లాంటి విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అవి ఉన్నాయని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కె రమేష్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జిఒ నంబర్‌ 77ని తీసుకొచ్చి పేద విద్యార్థులను ఉన్నత విద్యను దూరం చేస్తోందన్నారు. బకాయి స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అదే విధంగా భవిష్యత్తు కార్యాచరణ తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సోషన్‌ ముక్తిమంచ్‌ జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.