Nov 21,2020 21:48

ఆర్‌జెడికి వినతిపత్రం ఇస్తున్న యుటిఎఫ్‌ నాయకులు నాగమల్లేశ్వరరావు, ప్రేమ్‌కుమార్‌

గుంటూరు : తాడికొండ మండలం, లాంలోని మండల పరిషత్‌ ప్రాధమికోన్నత పాఠశాల విద్యార్థులను తాతిరెడ్డిపాలెం, ఫణిధరం, ప్రాధమిక పాఠశాలలకు బదిలీ చేసిన బాధ్యుల్ని గుర్తించి, చర్యలు తీసుకోవాలని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.ప్రేమ్‌కుమార్‌, కె.నాగమల్లేశ్వరరావు కోరారు. ఈ మేరకు శనివారం పాఠశాల విద్య ఆర్‌జెడి రవీంద్రనాధ్‌రెడ్డికి మెమోరాండం అందజేశారు. లాం ప్రాధమిక పాఠశాలలో చేరిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులుగానీ, పాఠశాల ప్రధానోపాధ్యాయుని అనుమతి లేకుండా 12 మందిని తాతిరెడ్డిపాలెం, ఇద్దర్ని ఫణిధరం ప్రాధమిక పాఠశాలల్లో ఉన్నట్లు ఛైల్డ్‌ ఇన్ఫోలో నమోదు చేశారని, ఇదే విషయాన్ని స్థానిక ఎంఇఒకు తెలియజేయగా విచారించి, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఎలా నమోదు అయ్యాయి అని ఎదురు ప్రశ్న వేస్తున్నారన్నారు. పాఠశాల హెచ్‌ఎం, సిబ్బంది ఫిర్యాదు మేరకు డిఇఒ గుంటూరు డిప్యూటీ డిఇఒతో విచారణ చేయించారని, అయినా దోషులు ఎవరనేది తేల్చకుండా, తూతూమంత్రంగా నివేదిక ఇచ్చారని, అయితే ఈ నివేదికను డిఇఒ తిరిస్కరించి, తిరిగి విచారణకు ఆదేశించారని, కానీ ఈలోగా సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కావున ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఉందో గుర్తించాలని, ఎంఇఒ కార్యాల యంలో సంబంధం లేకుండా ఇలా మార్పులు చేయటం సాధ్యం కాదని, కావున కారకుల్ని గుర్తించి, చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళన చేస్తామన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రాష్ట్ర సహాధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు, జిల్లా కోశాధికారి యం.కళాధర్‌, జిల్లా కార్యదర్శి ఎండి.షకీలాబేగం, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ ఎన్‌వి. జగదీష్‌కుమార్‌, పాఠశాల హెచ్‌ఎం ఫిలోమెన్‌, ఉపాధ్యాయులు అంకమ్మరావు ఉన్నారు.