Oct 03,2021 12:56

   విజ్ఞానం, వినోదం, వికాసం లక్ష్యంగా బాలసాహిత్య రచన చేయాలని బాలసాహితీ వేత్తలు నిర్దేశించారు. ఆ లక్ష్యంతోనే బాలసాహిత్యకారులెందరో రచనలను వండి వారుస్తూ బాలసాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారు. పిల్లలకు ఏది చెప్పినా మంచినే చెప్పాలి. జంతుపాత్రల్లో చిన్నయసూరి, ఈసపు కథలు చెప్పినా, రాజుల పాత్రలతో పేదరాశి పెద్దమ్మ కథలు చెప్పినా వాటన్నిటిలో మానవత్వం, సహాయగుణం, కష్టార్జితం, దయాధర్మాలకు పెద్దపీట వేశారు. ఆకాశవాణి విశ్రాంత ఉద్యోగి సర్వశుద్ధి హనుమంతరావు, ప్రసిద్ధ పత్రికల్లో రాసిన బాలల కథలనే 'స్నేహధర్మం' పేరుతో విశాలాంధ్ర వెలువరించింది. 'కథ మొదట్లో కుతూహలాన్ని, మధ్యలో చెప్పేది రక్తి కట్టిస్తూ చివర్లో ఆలోచనలని కలిగించాలని' ఆరుద్ర గారన్నట్టు పుస్తకంలోని కథలన్నీ చదివించి, ఆలోచనలు రేకెత్తించేవిగా ఉన్నాయి.
    ఈ పుస్తకంలో చారిత్రిక కథలు, జానపద కథలు, సాంఘిక కథలు, అద్భుత కథలు, నీతి కథలు కూడా ఉన్నాయి. ఎనిమిదో తరగతి నుంచి ఉన్నత తరగతుల విద్యార్థులకు ఉద్దేశించి రాసిన కథలివి. 'తెలివైన కాకి' కథలో కడవలో అడుగుకి చేరిన నీరు తాగడానికి తన తాతల కాలం నాటి పద్ధతిని కాకుండా ద్రాక్ష గుత్తులు వేస్తుంది కాకి. తాను తాగటమే కాకుండా తియ్యటి ద్రాక్ష రసాన్ని తన మిత్రులకు పంచి వారిచేతనే కాకుండా మనచేత కూడా శభాష్‌ అనిపించుకుంటుంది. 'గారడి' కథలో గారడీ చేసే వాడికి అన్నం సృష్టించడం వస్తే పొట్టకూటి కోసం వేరేవారి దగ్గర విద్యను ప్రదర్శించాల్సిన అవసరం లేదన్న సారాంశాన్ని తెలిపింది. విద్యల అర్థాలను, ఉపయోగించే విధానాన్ని తెలిపి, ధనాన్ని ఎలా వ్యయం చేయాలో చక్కగా చెప్పిన కథ 'పరిష్కారం'. ఎదుటివారిని గుడ్డిగా అనుకరిస్తారు కొందరు. అలా అర్థం లేని అనుకరణ వ్యర్థం అని చాటింది 'జామచెట్టు' కథ. గాడిద, ఉడుత, మర్రిచెట్టు, పిల్లలు ఎందుకు ఊగారో తెలియకుండా జామచెట్టు ఊగింది. ఫలితంగా కాయలన్నీ రాలిపోవడంతో యజమానికి కోపమొచ్చి, చెట్టుని నరికించాడు. ఉన్నత లక్ష్యంతో, ఉత్తమమైన కోరికలనే కోరుకోవాలని తెలిపే ఇతివృత్తంతో 'మూడు తాటిచెట్లు' కథ రాశారు రచయిత. వాటి కోరికలను వివరిస్తూ అవి తీరే విధానాన్ని చక్కగా మలచి, శాశ్వతత్వం కోరిన మూడవ తాటిచెట్టు కోరికను కథ రూపంలో రూపొందించిన విధానం బాగుంది.
      'స్నేహధర్మం' కథలో అమాయకుడైన శివయ్యను మిత్రుడు సోమలింగం ప్రతిసారీ స్నేహధర్మం అంటూ మోసగించడం, అతని దుర్మార్గపు ఆలోచనలను పసిగట్టిన పూటకూళ్ళమ్మ 'మాతృధర్మం' పేరుతో శివయ్యకు ఆసరాగా నిలవడం బాగుంది. మను 'సాహస చిన్ను' కథగా చిత్రించి. అది చేసిన అల్లరి పనులను కమ్మగా కథగా మలచిన తీరు ఆకట్టుకుంది. తేనె తయారు చేసే గుణాన్ని తేనెటీగ నుంచి వేరు చేయలేనట్టే, వ్యక్తిలో దాగిన ప్రతిభా సంపదను దూరం చేయలేమని తెలిపే కథ 'గంధర్వుడి మేలు'. ధైర్యం, చురుకుదనం తెలివితేటలనే లక్షణాలుంటే వేరే వరాలెందుకు అంటుంది 'ఆకాశంలో యుద్ధం' కథ. మెరిసేదంతా బంగారం కాదని, రూపం చూసి మోసపోకూడదని, బాహ్య సౌందర్యం కన్నా మానసిక సౌందర్యం గొప్పదని చాటింది 'కలలరేడు కురూపం' కథ.
ఇలా సంపుటిలోని కథల ఇతివృత్తాలన్నీ వైవిధ్యంగా ఉండి, ఆలోచనలు రేకెత్తిస్తూ గబగబా చదివిస్తాయి. పిల్లలు మరో లోకంలో విహరించడం కోసం తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది. ఇందులో 38 కథలున్నాయి.

నారంశెట్టి ఉమామహేశ్వరరావు
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
94907 99203
పుస్తకం -స్నేహధర్మం
పేజీలు : 77
వెల - 70
ప్రతులు: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌,
విజయవాడ- 4.