Oct 28,2021 19:16

dharna chestunna vidyardulu

వెటర్నరీ కళాశాల విద్యార్థులు ధర్నా
ప్రజాశక్తి-గన్నవరం
ఆంధ్రప్రదేశ్‌ వెటర్నరీ స్టూడెంట్స్‌, గ్రాడ్యుయేట్స్‌ అసోసియేషన్‌, రాష్ట్రంలో జరుగుతున్న పశువైద్య ప్రమాణాలు ఉల్లంఘనలకు నిరసనగా గురువారం గన్నవరం పశువైద్య కళాశాల విద్యార్థులు బ్లాక్‌ డే నిరసన కార్యక్రమం నిర్వహించారు. పోరాట కమిటీ నాయకులు వివేకానందరెడ్డి మాట్లాడుతూ..ఒక పశువుకి పశు వైద్యం అందించాలంటే పట్టభద్రుడైన పశు వైద్యుడు అందించాలని, లేదా వారి సమక్షంలో ప శువైద్య సహాయకుల ప్రధమ చికిత్స స్థాయి వైద్యం మాత్రమే అందించాలన్నారు. వారి స్వతహాగా ఎటువంటి పశువైద్య సేవలుఅందించడం అనేది పశువైద్య ప్రమాణాలకు విరుద్ధం, ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో పదివేలకు పైగా యానిమల్‌ హస్బెండ్రి అసిస్టెంట్లను నియమించామన్నారు. అవసరమైన స్థాయిలో పశు వైద్యుల నియామకాన్ని చేపట్టకుండా పూర్తిస్థాయి పశు వైద్యాన్ని వెటర్నరీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా 1984కి విరుద్ధంగా, ఈ అసిస్టెంట్లు చేతిలో పెట్టే పరిస్థితులు కల్పించామన్నారు. ఇది ముమ్మాటికీ ప్రమాణాలతో కూడిన శాస్త్రీయ పశువైద్యం చీకటి లోకి నెట్టివేయడం లాంటిదే అని వివరించారు. మరో నాయకులు పద్మిని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్థాపిస్తున్నా నియోజకవర్గ స్థాయి వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో అసిస్టెంట్‌, అటెండర్‌ పోస్టులు మాత్రమే నియామకం జరిపి, వ్యాధి నిర్ధారణలో నిపుణులైన పశు వైద్యుల నియామకాన్ని ప్రభుత్వ ఉన్నత అధికారులు విస్మరించారన్నారు. వైద్యులు లేకుండానే వ్యాధి నిర్ధారణ కేంద్రాలను నిర్వహిస్తుండటం సరికాదన్నారు. ఇది పశు వైద్య ప్రమాణాలను మరింతగా దిగజార్చే చర్యగానే పేర్కొన్నారు. వెటర్నరీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనలకు 100శాతం విరుద్ధమన్నారు. ప్రస్తుతం పశుసంవర్ధక శాఖలో 1588 మంది పశు వైద్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారన్నారు. ఇంకా 2251 పశు వైద్యులు కొరత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ అధికారులు ఈ నియామకాలను చేపట్టడానికి విముఖత చూపిస్తున్నారని జస్వంత్‌ రెడ్డి వివరించారు. పోరాటం చేస్తేనే ప్రభుత్వం దిగొస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ పిజిలు ప్రవీణ్‌ , సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.