May 03,2021 07:19

ప్రపంచవ్యాప్తంగా అస్వతంత్ర దేశాల ప్రజల్లో చైతన్య స్రవంతులు ఉప్పొంగి వలసవాదులను తరిమేశాక, విశ్వవ్యాప్తంగా జాతీయాభిమానం గల స్వతంత్ర ప్రజాతంత్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాక బడుగుదేశాల నుంచి దోచుకున్న దోపిడీ సొమ్ముతో పబ్బం గడుపుకోడానికి అలవాటు పడ్డ సదరు వలసవాద దేశాలకు దిక్కు తోచకుండా పోయింది. వెనుకబడ్డ దేశాల సహజ వనరులను, అలవిమాలినంత అగ్గవగా లభించే అక్కడి శ్రామికశక్తిని దోచుకోడానికి- ఆ వనరుల ద్వారా తాము తయారు చేసిన వస్తూత్పత్తికి మార్కెట్లను సృష్టించుకోవడానికి వాళ్ళు తీవ్రంగా ఆలోచించి కనిపెట్టిన వినూత్న ఉపాయమే నయా వలసవాదం. నయా వలసవాదం వ్యాపారస్వేచ్ఛ, ప్రపంచీకరణ, ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌, బహుళజాతి సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలు మొదలైన ఓ పట్టాన కొరుకుడు పడని ముసుగులు వేసుకుని పేద దేశాల్లోకి చాపకింద నీరులా చొరబడింది. నయా వలసవాదం, దాని రూపాలైన వ్యాపారస్వేచ్ఛ, ప్రపంచీకరణ, ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌, బహుళజాతి సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలు అన్న కుహనా సిద్ధాంతాలు మూడవ ప్రపంచ దేశాల్లోని ఏ కొద్దిమంది సామ్యవాద భావజాలం ఉన్న మేధావులు, మార్క్సిస్ట్‌ రాజనీతివేత్తలు, వామపక్ష రాజకీయ నాయకులు, కవులు, రచయితలకో తప్ప ఇంకెవ్వరికీ ఓ పట్టాన అర్థం కావు. ఈ ముసుగుల్లో అసలు అర్థం కాని ముసుగు ప్రపంచీకరణ. అది దాని పబ్బం గడుపుకోడానికి పేద దేశాల్లో అది చేసే మొట్టమొదటి పని అక్కడి సమాజ సంప్రదాయాల్ని, సంస్క ృతిని ధ్వంసం చెయ్యడం. మానవ సంబంధాలను దెబ్బకొట్టడం. ఇక్కడి పౌరుల్లో చైతన్య వీచికలు వీయకుండా వారికి డబ్బాశ చూపించి వారిని గుక్క తిప్పుకోకుండా షిప్టుల పేరుతో రాత్రింబవళ్ళూ కష్టించే పని రాక్షసులుగా మార్చివెయ్యడం. దొరికిన కొద్ది విరామంలో ఆ పని ఒత్తిడి నుంచి సేదతీరడానికి క్లబ్బుల్లో, పబ్బుల్లో ఒళ్ళు తెలియని తాగుబోతులుగా, తిండిపోతులుగా మిగిలిపోయేలా చెయ్యడం. అలా అది బుద్ధికి పదును పెట్టుకునే సమయం గాని, అవకాశం గానీ ఇక్కడి పౌరులకు దొరక్కుండా చాలా జాగ్రత్త పడుతుంది. అందువల్ల ఇక్కడి యువత చైతన్యం, హక్కులు, ఉద్యమం, ఉద్యమించడం అన్న మాటలకు కూడా ఎన్నడో దూరమైపోయింది. మన చాలామంది యువకులు ప్రపంచీకరణ కర్తల చేతుల్లో డూడూ బసవన్నలుగా మారిపోయారు.
   ప్రపంచీకరణ ఫలితంగా మన పరిశ్రమలకు లాభాల పైత్యం పట్టుకుంది. ఒట్టి వ్యాపార దక్పథాన్ని అలవరచు కున్నాయి. కన్నతల్లి లాంటి ప్రభుత్వ సంస్థలు మూత పడ్డాయి. మాయలాడి లాంటి కార్పొరేటు సంస్థలు నిస్సిగ్గుగా దారి పొడుగునా పక్కలు వేసి, మన బలహీనతల్ని సొమ్ముచేసుకుంటున్నాయి. జనాలు పట్టణాలకు, నగరాలకు వలసపోగా పల్లెలు విరూపమైనాయి. పట్టణాలు, నగరాలు ఇరుకిరుకు మురికివాడలతో, కాలుష్యంతో ఊపిరాడక చస్తున్నాయి. భార్యాభర్తల సంబంధాలు కొడిగట్టినాయి. పిల్లలు హాస్టల్‌ గదుల్లో అలమటిస్తున్నారు. మూడు కాళ్ల ముసలివాళ్ళు 'అమ్మా, నాన్నా' అన్న కమ్మని పిలుపులకోసం కళ్ళకు వత్తులేసుకుని వృద్ధాశ్రమాల్లో ఎదురు చూస్తున్నారు. మానవ సంబంధాలన్నీ వ్యాపారాలైపోయాయి. వ్యాపార వస్తువులుగా మారిన వాటిలో స్త్రీ శరీరం ప్రథమస్థానం ఆక్రమించింది. దిక్కుతోచక ఏడ్చి ఏడ్చి బాల్యం ఇరుగ్గదిలో ఫ్యాన్నూ, వ్యవసాయ బతుకులు వేపచెట్టునూ ముద్దాడుతున్నాయి. దున్నేవాళ్ళు లేక పొలాలు ముళ్ళకంపలతో, పట్టించుకునే వాళ్ళు లేక చెరువులు సర్కారీ చెట్లతో అడవులైపోయాయి.
   ప్రభుత్వాలు, ప్రభుత్వ పెద్దలూ మూకుమ్మడిగా కార్పొరేట్లు, బహుళజాతి సంస్థలు, పెత్తందారీ పెద్దన్న వలసవాద దేశాలూ వేసే కుక్క బిస్కెట్లకు లొంగిపోయి వారి పబ్బం గడిపే దళారీలుగా మిగిలిపోతున్నారు. సన్నకారు రైతులు, దళితుల కడుపులు కొట్టి వారి నుంచి వేలాది ఎకరాల సారవంతమైన భూముల్ని అమానవీయంగా లాక్కుంటూ ప్రయివేటు కార్పొరేటు సంస్థల పాలు చేస్తున్నారు. సెజ్జుల పేరిట లక్షల ఎకరాల భూముల్ని కాజేసి బహుళజాతి సంస్థల పరం గావిస్తున్నారు. వాళ్ళు అక్కడ కంపెనీలు పెట్టి ఇన్నాళ్ళూ తలెత్తుకు తిరిగిన అన్నదాతలను ఉద్యోగాల పేరిట ఆశలు చూపించి ఆ రైతుల భూముల్లోనే లేచిన తమ బహుళజాతి కంపెనీల గేట్ల ముందు కాపలా మనుషులుగా తయారు చేసుకుంటున్నారు.
   ఈ ప్రక్రియల్లో భాగంగా లక్షల ఎకరాల వ్యవసాయ భూములు, చెరువులు, అడవులు, నాశనమయ్యాయి. అభివృద్ధి పేరుతో నగరాల్లో పేదలు నివసించే వాడలను నేలమట్టం చేస్తూ వాటిపై ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేట్‌ విల్లాలు కడుతున్నారు. ఆ పేదలు తమ ఆవాసాలు కోల్పోయి దిక్కూమొక్కూ లేనివాళ్ళుగా మారిపోతున్నారు. లేదంటే ఎదిరించి తుపాకీగుళ్ళకు బలైపోతున్నారు. ప్రపంచీకరణ తన విషబీజాల్ని, వెదజల్లడం ప్రారంభించింది. భూముల్ని పోగొట్టుకున్న గ్రామీణులు పట్టణాల్లో నగరాల్లో కాందీశీకులుగా మిగిలిపోతున్నారు.
   ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మానవుని పట్టి పీడిస్తున్న మంచినీటి కొరత, ఆకలి, నిరుద్యోగం, పేదరికం, అలవిగాని ఆర్ధిక సామాజిక అంతరాలు, శారీరక మానసిక రుగ్మతలు, స్త్రీ పురుష సంబంధాల్లో ఒడిదొడుకులు, కుటుంబ కలహాలు, రాజకీయ కల్లోలాలు, కాలుష్యపూరితమైన పర్యావరణ సమస్యలు, గ్రామీణ ముఠాకక్షలు సమస్త అలజడులు కూడా ప్రపంచీకరణ దుష్ఫలితాలే. సమస్త అరిష్టాలకూ కారణభూతమవుతున్న ప్రపంచీకరణ స్వరూప స్వభావాలను గుర్తించి, దాని దాడిని ఎదుర్కోవడానికి మేధావులు ఉద్యమాల అస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. వామపక్ష రాజకీయ నాయకులు, వాళ్ళ పార్టీలు నిరంతరం పోరాటాలు చేస్తున్నాయి. కవులు రచయితలూ కలాల కత్తులు దూస్తున్నారు. తెలుగు సాహిత్యంలో కూడా ప్రపంచీకరణనూ దానివల్ల సంభవిస్తున్న అనర్థాలను పసిగట్టి ఎత్తి చూపిస్తూ సామాజిక చైతన్యాన్ని తీసుకురావడానికి కవులూ రచయితలూ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. అయితే ఆ రచనలన్నీ ఎక్కడివక్కడ ముక్కలు చెక్కలుగా పడున్నాయి. ఎవరో కొందరు చదువుతున్నారు. అందువల్ల వాటివల్ల ఒక సమగ్రమైన జనావగాహన గానీ, సామూహిక ప్రజాచేతన గానీ కలగడం లేదు. అటువంటి ఒక ఖాళీని పూరించడానికి నిబద్ధతతో పూనుకున్నారు ప్రభుత్వ తెలుగు అధ్యాపకులైన కరణం శ్రీనివాసులు రెడ్డి గారు. ఆయన 'ప్రపంచీకరణ కవిత్వం - మానవ సంబంధాలు' అన్న శీర్షికతో ఈ నేపథ్యంలో వచ్చిన కవితామయ రచనలన్నింటినీ ఒక చోటికి తెచ్చి సూక్ష్మంగా పరిశీలించి గొప్ప పరిశోధన చేశారు. ఒక బృహత్తరమైన సిద్ధాంత గ్రంథం రచించారు. ఇందులో వారు సోదాహరణంగా ప్రపంచీకరణ స్వరూప స్వభావాలను స్పష్టపరచి, దాని విష ఫలితాలను ఎత్తిచూపి, దాని పారదోలడం ఎంత అవసరమో గుర్తింపజేసి సదరు ఉద్యమానికి చదువరులందరినీ కార్యోన్ముఖులను గావిస్తున్నారు. ఈ పరిశోధన చేసిన శ్రీనివాసులు రెడ్డి గారిని, నేతృత్వం వహించిన డా. రాజేశ్వరి గారిని, దీని వెనుక ఉన్న అదృశ్యహస్తం ఆచార్య మేడిపల్లి రవికుమార్‌ గారిని అభినం దించకుండా ఉండలేం.
   'ప్రపంచీకరణ కవిత్వం - మానవ సంబంధాలు' ప్రపంచీకరణ పట్ల కవులందరి అవగాహనను వడపోతపోసి దాని స్వరూప స్వభావాలను చర్చించిన గొప్ప విజ్ఞానదాయకమైన గ్రంథం. విమర్శక మత్స్యకారులు విశ్వవిద్యాలయ తటాకాల్ని విచక్షణ అనే సింగితాలతో ఎంత దేవులాడినా పరిశోధనల నత్తగవ్వలే కుప్పలు తెప్పలుగా దొరుకుతున్న ఒకానొక కష్టకాలంలో లభ్యమవుతున్న అతికొద్ది ముత్యాల్లో ఒకానొక ఆణిముత్యం. సమాజానికి నువ్వు కొత్తగా ఇస్తున్నది ఏంటి? అని అప్లికేషన్‌ పార్శ్వాన్ని ప్రశ్నిస్తే, నేను ఎనలేని అవగాహనని, ప్రజా చైతన్యాన్ని ఇచ్చి ఉద్యమోన్ముఖుల్ని చేస్తున్నానని తలెత్తుకుని సమాధానం చెప్పగలిగిన పరిశోధన. శ్రీనివాసులు రెడ్డి గారి పుస్తకం విలువను సరిగ్గా చెప్పాలంటే ఇలా చెప్పితే సరిపోతుంది. చదవడం దృష్ట్యా చూస్తే పుస్తకాలు మూడు రకాలు. జనాలు చదివితే రచయితకు తృప్తిని, లాభాన్ని చేకూర్చేవి. చదవకపోతే జనాలు నష్టపోయేవి. చదవకపోతే జనాలు తీరని స్థాయిలో నష్టపోయేవి. ఇది ఈ మూడో కోవకు చెందిన పుస్తకం. ప్రపంచీకరణను అర్థం చేసుకోడానికి దాని విష ఫలితాలను గుర్తించడానికి, దాని ఉచ్చులో పడకుండా తప్పించుకోడానికి సదరు భూతాన్ని తరిమికొట్టడానికి కావలసిన చైతన్యాన్ని, ప్రేరణను పొందడానికి ఈ పుస్తకం చదవడం చాలు. ఈ ఒక్క పుస్తకం ప్రపంచీకరణలో ఇమిడి ఉన్న అన్ని పార్శ్వాల పట్లా 'ప్రపంచీకరణ' అనే పదాన్ని మొట్టమొదటి సారిగా విన్న అతి సాధారణ పాఠకుడికి కూడా ఒక సమగ్రమైన అవగాహన కల్పించగలదు. ప్రపంచీకరణ గురించి ఈ వ్యాసంలో చేసిన విశ్లేషణ అంతా ఈ సిద్ధాంత గ్రంథం చదవడం వల్ల కలిగిన అవగాహన మాత్రమే! అలాంటి ఈ పుస్తకం ముద్రణకు నోచుకుని జనావగాహన కలిగించి ఒక ఉన్నతమైన సమాజ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషించాలని ఆశిద్దాం.


- కవితశ్రీ
94946 96990