Oct 14,2021 08:25

- ఇప్పటి వరకూ రూ.5,500 కోట్లు వెచ్చింపు శ్రీ మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.8,440 కోట్లు
- వచ్చే ఆగస్టు నాటికి మరో రూ.2 వేల కోట్లకుపైగా కేటాయిస్తేనే..
ప్రజాశక్తి - ఒంగోలు బ్యూరో : 
ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గత టిడిపి ప్రభుత్వం ఐదేళ్లూ ప్రకటనలతోనే గడిపేసి పూర్తి వైఫల్యాన్ని మూటగట్టుకుంది. వైసిపి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఇప్పటికే దాదాపు రెండేన్నరేళ్లు కావస్తోంది. ఇప్పటికే మొదటి సొరంగం పూర్తయింది. రెండో సొరంగం పనులు జరగాల్సి ఉంది. ఇటీవల జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ వచ్చే ఆగస్టులో మొదటి సొరంగం ద్వారా మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు.
 

మొదటి నుంచి నిధుల సమస్య
వెలుగొండకు మొదటి నుంచి నిధుల సమస్య వెంటాడుతోంది. 1996లో శంకుస్థాపన జరిగినప్పుడు దీని నిర్మాణ వ్యయం అంచనా రూ.980 కోట్లు. అప్పటి నుంచి 2004 వరకూ పనులు చేపట్టలేదు. చంద్రబాబు తొమ్మిదేళ్లు దీని జోలికిపోలేదు. 2004లో సిఎం అయ్యాక వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి రెండోసారి శంకుస్థాపన చేశారు. పనులు చేపట్టారు. అప్పటికే దీని నిర్మాణ వ్యయం అంచనా రూ.5,500 కోట్లకు చేరింది. ఆయన కాలంలోనే సొరంగాలకు శంకుస్థాపనలు చేశారు. తొలుత పనులు వేగంగా సాగాయి. ఆ తర్వాత ఆగిపోయాయి. ప్రస్తుతం దీని నిర్మాణ అంచనా వ్యయం రూ.8,440 కోట్లుగా తేల్చారు. ఇప్పటివరకూ రూ.5,500 కోట్లు వెచ్చించారు. ఇంకా రూ.3 వేల కోట్లకుపైగా వెచ్చించాల్సి ఉంది. ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించిన రూ.1,595 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఇందులో పనులకు రూ.795 కోట్లు, పునరావాసానికి రూ.500 కోట్లు కేటాయించారు. పనులపై పర్యవేక్షణ, సకాలంలో నిధులు రప్పించి పనులు పూర్తయ్యేలా చూసే ప్రక్రియ సీరియస్‌గా జరగడం లేదు. వచ్చే ఆగస్టులోగా ప్రారంభం కావాలంటే కనీసం రూ.2 వేల కోట్లకుపైగా నిధులు విడుదల చేయాల్సి ఉందని అంచనా.

పునరావాస కల్పనే సవాలు
ప్రాజెక్టు పనులపై పెట్టిన దృష్టి పునరావాసంపై పెట్టలేదు. ప్రాజెక్టు రిజర్వాయర్‌లో 11 ముంపు గ్రామాలున్నాయి. ఇప్పటివరకూ కేవలం రెండు గ్రామాల నిర్వాసితులను తరలించారు. ఒక్కో కుటుంబానికి రూ.12.50 లక్షల చొప్పున ప్యాకేజీ నిర్ణయించారు. మొత్తం 7,555 మంది నిర్వాసితులు పరిహారానికి అర్హులని అధికారులు తేల్చారు. వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,305 కోట్లు కేటాయించింది. ఈ నిధులు పూర్తిగా రాలేదు. ప్రస్తుతం రెండు గ్రామాల వారికే చెల్లించారు. మిగతా తొమ్మిది గ్రామాల నిర్వాసితులకు చెల్లించాల్సి ఉంది. అక్కడ నుంచి గ్రామాలు ఖాళీ చేయాలంటే ముందు కాలనీలు ఏర్పాటు చేయాలి. ఈ ప్రక్రియ కూడా నిదానంగా సాగుతోంది. కొన్ని గ్రామాలకు స్థలాలు చూసి ప్లాట్లు వేస్తున్నారు. వచ్చే ఆగస్టులోపు అన్ని గ్రామాలనూ తరలించాలి. అందరికీ ప్యాకేజీలు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇచ్చి పూర్తి చేయాలి. నిర్వాసితులను తరలిస్తేనే నీటిని విడుదల చేయడానికి వీలుంటుంది.

జరగాల్సిన పనులు ఇవీ..
ప్రాజెక్టును సిఎం జగన్‌ ప్రారంభించాలంటే ఆగస్టు నాటికి మొదటి సొరంగంలోని 1.143 కిలోమీటర్ల పొడవు మాన్యువల్‌గా తవ్విన ప్రారతానికి లైనింగు పనులు పూర్తి చేయాలి. కన్వేయర్‌ బెల్టు తెగిపోవడంతో మాన్యువల్‌గా తవ్వకం చేశారు. ఈ పనులు పూర్తి చేయాల్సి ఉంది. శ్రీశైలం రిజర్వాయర్‌ ఎగువన కొల్లంవాగు వద్ద హెడ్‌ రెగ్యులేటరీ పనులు పూర్తి చేయాల్సి ఉంది. రిజర్వాయర్‌లో నీరు ఉన్నందున అక్కడ పనులు చేపట్టడం సాధ్యం కావడం లేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. రెండో సొరంగం ఇంకా ఏడు కిలోమీటర్లు తవ్వకం జరగాల్సి ఉంది. ఈ పనులకు మొదటి సొరంగాన్ని వాడుకుంటున్నారు. ఇవన్నీ పూర్తి కావాల్సి ఉంది. వచ్చే ఆగస్టులో ప్రారంభం అంటే, ఇంకా పది నెలల కాలమే ఉంది. రెండో సొరంగానికి 2023 ఫిబ్రవరి గడువు ఖరారు చేశారు. ప్రాజెక్టు భారీ లక్ష్యాలుగా ఉన్న 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల జనాభాకు తాగునీరు అందించాలంటే తక్షణం అవసరమైన నిధులు కేటాయించాలి. అప్పుడే రైతుల కలలు సాకారమవుతాయి.