Aug 15,2021 12:42

     హీరోగా సినిమాలు చేస్తూనే విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తూ అలరిస్తున్నారు మలయాళీ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌. పాత్ర నచ్చితే చాలు వెంటనే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేస్తారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ 'పుష్ప', కమల్‌ హాసన్‌ 'విక్రమ్‌' సినిమాల్లో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ చిత్రంలో ఫహాద్‌ మెయిన్‌ విలన్‌గా కనిపించనున్నాడు. అయితే నటుడిగా తెరంగేట్రం చేసిన తొలినాళ్లలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే నటనకు పనికిరాడు అంటూ చేసిన విమర్శలు అతనిని మానసికంగా కంగదీశాయి. దీంతో పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఫహాద్‌ ఫాజిల్‌ ఎక్కడైతే కిందపడి అవమానాలు పొందాడో అక్కడే కెరటంలా పైకి లేవాలని భావించి, మరోసారి సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. 'క్యారెక్టర్‌లో వేరియన్స్‌.. పెర్ఫార్మెన్స్‌కి ప్లస్‌' ఉంటే చాలంటూ విలక్షణ పాత్రలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

వేరియన్స్‌.. పెర్ఫార్మెన్స్‌కి ప్లస్‌ !

పేరు : ఫహాద్‌ ఫాజిల్‌
పూర్తి పేరు : అబ్దుల్‌ హమీద్‌ మహమ్మద్‌
ఫహాద్‌ ఫాజిల్‌
పుట్టిన తేదీ : ఆగస్టు 8, 1982
పుట్టిన ప్రాంతం : ఎర్నాకుళం, కేరళ
నివాస ప్రాంతం : అలప్పుజ, కేరళ
చదువు : ఎంఎ ఫిలాసఫీ
భార్య : నజ్రియా నజీమ్‌
తల్లిదండ్రులు : ఫాజిల్‌,
రోజినా ఫాజిల్‌
సోదరులు : ఫర్హాన్‌ ఫాజిల్‌, అహ్మదా ఫాజిల్‌, ఫాతిమా ఫాజిల్‌

    బ్దుల్‌ హమీద్‌ మహమ్మద్‌ ఫహాద్‌ ఫాజిల్‌ అంటే బహుశా ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు. కానీ ఫహాద్‌ ఫాజిల్‌ అంటే అందరికీ టక్కున మళయాల స్టార్‌ హీరో గుర్తుకు వస్తారు. ప్రస్తుతం మలయాళంలో ఎన్నో సినిమాల్లో నటిస్తూ స్టార్‌ హీరోగా కొనసాగుతున్న ఈ నటుడు మొట్టమొదటిసారిగా తెలుగు ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే బన్నీ హీరోగా తెరకెక్కుతున్నటువంటి 'పుష్ప' సినిమాలో పుష్పరాజ్‌తో పోటీ పడటానికి రంగంలోకి దిగాడు. అయితే తన క్యారెక్టర్‌ కోసం తెలుగు నేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. సినిమాలోని తన క్యారెక్టర్‌ను పండించడానికి, తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడానికి, తన పాత్రకు తగ్గట్టుగా రాయలసీమలోని చిత్తూరు యాస నేర్చుకున్నారు. చిన్నతనం నుంచి నటనపై మక్కువ ఉన్న ఫహాద్‌ 2002లో తొలిసారిగా ఇండిస్టీలోకి అడుగుపెట్టి 'కైయెతుమ్‌ దూరత్‌' అనే రొమాంటిక్‌ చిత్రంలో నటించారు. ఈ చిత్రాన్ని అతని తండ్రి ఫాజిల్‌ స్వయంగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద తీవ్ర నిరాశపరిచింది.
     దీంతో ఘోరమైన అవమానాలు-విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో ఎలాంటి ప్రిపరేషన్‌ లేకుండా వచ్చి ఆ అంచనాలు తానే అందుకోలేకపోయానని నిజాయితీగా ఒప్పేసుకున్నాడు ఫహాద్‌. ఆపై యాక్టింగ్‌ను వదిలేసి.. అమెరికాకు వెళ్లిపోయాడు. అక్కడే ఐదేళ్ల పాటు ఏంఎ ఫిలాసఫీ చేశాడు. అనంతరం తండ్రి ప్రొత్సాహంతో మరోసారి దర్శకుడు రంజిత్‌ డైరెక్షన్‌లో 'కేరళ కేఫ్‌' (2009)తో రీ-ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి నటుడిగా ఫహాద్‌ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చప్పా ఖురిష్‌, డైమండ్‌ నెక్లెస్‌, 22 ఫిమేల్‌ కొట్టాయం, అన్నయుమ్‌ రసూలుమ్‌, బెంగళూరు డేస్‌, మహేషింటే ప్రతీకారం.. ఇలా వరుస హిట్లు నటుడిగా ఫహాద్‌ను ఎస్టాబ్లిష్‌ చేశాయి. ఒకానొక స్టేజ్‌కి వచ్చేసరికి మాలీవుడ్‌లో టాప్‌ రెమ్యునరేషన్‌ అందుకునే హీరోల జాబితాలోకి చేరిపోయాడు ఫహాద్‌. అంతేకాదు ఇటీవల వరుసగా ఓటీటీల్లో సక్సెస్‌ సాధించి, ఓటీటీ స్టార్‌గానూ మారాడు. తద్వారా నేషనల్‌ వైడ్‌ ఫేమస్‌ అయ్యాడు ఫహాద్‌ ఫాజిల్‌. ఇటీవల విడుదలైన మాలిక్‌ సినిమాలో ఫహాద్‌ నటనకు అందరూ ఫిదా అయ్యారు. కాగా ఇక ఇప్పటికే విడుదల చేసిన 'ది ఇంట్రడక్షన్‌ ఆఫ్‌ పుష్పరాజ్‌' వీడియో ఇంటర్నెట్‌లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్‌ చేస్తోంది.
       సినిమాల్లో ఫహాద్‌ సైకిక్‌ క్యారెక్టరైజేషన్‌ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. కేవలం కళ్లతోనే అతను పలికే హవభావాలు కట్టిపడేస్తుంటాయి. ప్రేయసిని నమ్మించి మోసం చేసే పాత్ర, దొంగ, సైకో, మానసిక రోగి, గ్యాంగ్‌స్టర్‌.. ఇలా పాత్రకు తగ్గ వేరియేషన్స్‌ను అలవోకగా ప్రదర్శించడం ఫహాద్‌కు నటనతో పెట్టిన విద్య. 'టేకాఫ్‌', ఎన్‌జన్‌ ప్రకాశన్‌, వారాతన్‌లాంటి కమర్షియల్‌ హిట్స్‌ మాత్రమే కాదు.. ఈ మధ్యకాలంలో 'ట్రాన్స్‌', 'సీయూసూన్‌', 'జోజి' 'మాలిక్‌'.. లాంటి వరుస ప్రయోగాత్మక సినిమాలతో ఇండియన్‌ వ్యూయర్స్‌కు దగ్గరయ్యాడు ఫహాద్‌ ఫాజిల్‌.. ఫహాద్‌ను విలక్షణ నటుడు అనడం కంటే అసాధారణమైన నటుడు అనడం కరెక్ట్‌.