Apr 04,2021 10:42

ప్రకృతి ప్రేమికులు ఇంటా, బయట రకరకాల మొక్కలను పెంచుతుంటారు. అంతేనా కొందరైతే ఇంటిచుట్టూ వేలాడే కుండీల్లోనూ మొక్కలు పెంచు తుంటారు. కానీ కొన్ని జాతుల మొక్కలు మాత్రమే వేలాడే కుండీల్లో పెంచుకోవడానికి వీలవుతుంది. అలాంటి మొక్కల పరిచయమే ఈ వారం విరితోటలో..
              వేలాడే కుండీల్లో పెంచుకునే మొక్కలు పొట్టిగా, బుస్సీగా ఉంటాయి. కొన్ని తీగలుగా కుండీల నుంచి కిందికి వేలాడతాయి. ఇవి ఇంట్లో, బయటనే కాకుండా మధ్యస్థ వాతావరణంలోనూ పెరిగే, సెమీషేడ్‌ మొక్కలు. పువ్వులు తక్కువగా పూస్తూ, ఆకులు నిగారింపుగా రమణీయంగా ఉంటాయి. ఈ మొక్కలకు నీటిని పోసేటప్పుడు జాగ్రత్తగా పోయాలి. వీటిని నేల కుండీల్లోనూ పెంచుకోవచ్చు.
                                                                 రోయొస్పాథోసియా
ఆర్నమెంటల్‌ జాతికి చెందిన ఇండోర్‌ మొక్క రోయొస్పాథోసియా. దీని ఆకులు పొడవుగా, మొనదేలిన కత్తి ఆకారంలో ఉంటాయి. లేత ఆకుపచ్చ, లేత తెలుపు, అగ్గిపెటె,్ట నీలంరంగుల చారలతో ఆకులు కళకళలాడుతుంటాయి. మొక్క అడుగు ఎత్తు వరకూ పెరుగుతుంది. మొవ్వలుగా మొక్క మొదలు నుంచి పిలకలు వస్తాయి. మొవ్వలో చిన్న చిన్న తెల్లటిపువ్వులు పూస్తాయి. వాటిలో నల్లటి గింజలు విత్తనాలుగా ఉంటాయి. వారానికి ఒకసారి కొద్దిగా నీళ్లు పోస్తే సరిపోతుంది. నీళ్లు నిలువ ఉంటే మొక్క కుళ్ళిపోయి, చనిపోతుంది. అందువల్ల కుండీల్లోంచి నీరు బయటకు పోయే వెసులుబాటు ఉండాలి. మట్టి ఎప్పుడూ పొడిగా ఉండాలి. చాలా కొద్దిగా మాత్రమే వెలుతురు కావాలి. ఇది పది డిగ్రీల లోపు ఎండలో బాగా పెరుగుతుంది. మొవ్వను జాగ్రత్తగా వేరులతో సేకరించి, వేరే కుండీలో నాటితే వేరే మొక్కగా పెరుగుతుంది. దీన్ని నేల కుండీల్లోనూ, వేలాడే కుండీల్లోనూ పెంచుకోవచ్చు.
                                               

strobilanthes

                                                      స్ట్రోబిలాంథెస్‌ డయరియానా
దీన్నే పీకాక్‌ ప్లాంట్‌, పెర్షియన్‌ షీల్డ్‌ ప్లాంట్‌ అనీ పిలుస్తారు. దీన్ని నేల కుండీల్లోనూ, వేలాడే కుండీల్లోనూ పెంచుకోవచ్చు. ఈ మొక్కకు చిత్రంగా ఉండే పత్రాలే అందం. ఆకు ముదురు చింతపిక్క రంగులో ఉంటుంది. శీర్షభాగం నుంచి అడ్డంగా ఆకుల మీద ఉండే చారలు ఎంతో అందంగా ఉంటాయి. చారలు మధ్యలో ముదురు నేరేడు రంగు డిజైన్‌ ఉంటుంది. దీనికీ కొద్ది కొద్దిగా నీళ్లు పోయాలి. తెలుపు, లేతనీలం రంగుల్లో చిన్నచిన్న పువ్వులు పూస్తాయి. కొద్దిగా వేడినీ తట్టుకోగలుగుతాయి. క్లోరినేటెడ్‌ నీటికి దూరంగా ఉంచాలి. లేకపోతే ఆకులు పాడయ్యే ప్రమాదం ఉంది. 26 అంగుళాలు ఎత్తు వరకూ పెరుగుతాయి. అఫిడ్స్‌, వైట్‌ఫ్లైస్‌ వంటి తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

jebrina

                                                               

                                                                   జెబ్రినా పెండులా
చూడచక్కని ఆకులతో అలరించే మొక్క జెబ్రినా పెండులా. ఇవి వయొలెట్‌, సిల్వర్‌, రెడ్‌, బ్లూ రంగులలో, చారలు వంటి డిజైన్లలో ఆకులు అలరిస్తాయి. సన్నని కాడ వచ్చి దానికి రెండువైపులా ఆకులు అలుముకుంటాయి. ఇండోర్‌లోనూ, తేలికపాటి ఎండలోనూ పెరుగుతాయి. మొక్క చాలా వేగంగా పెరుగుతుంది. దీనిని వేలాడే కుండీల్లోనూ, నేల కుండీల్లోనూ పెంచుకోవచ్చు. నేల మీద నాటితే నేలంతా తివాచీలా అల్లుకుపోతుంది. విచ్చలవిడిగా పెరిగే స్వభావం ఉన్న ఈ మొక్కను తరచూ కత్తిరించుకోవాలి. నాలుగు రోజులకొకసారి నీళ్లు పోస్తే సరిపోతుంది. ఈ మొక్కను రక్తపోటు, క్షయ, దగ్గు తదితర వ్యాధుల ఉపశమనానికి తయారుచేసే మందుల్లో వాడతారు.

fern

                                                                       

    ఫెర్న్‌
చూడగానే కంటికి ఇంపుగా, ఆకట్టుకునే మరో వన్నెచిన్నెల మొక్క ఫెర్న్‌. భూ ఉపరితలం మీద తొలిదశలో ఏర్పడిన వృక్ష జాతుల్లో ఫెర్న్‌ ఒకటి. ఫెర్న్‌ పదివేల రకాలలో లభిస్తుంది. ఒక్క రష్యాలోనే రెండువేల రకాలు ఉన్నాయి. మొక్కకు సన్నని కాండము, దానికి ఇరువైపులా చిన్న చిన్న పత్రాలు సమాన సైజుల్లో క్రమబద్ధంగా, ఎంతో అందంగా ఉంటాయి. వీటికి పువ్వులు, విత్తనాలు ఉండవు. బీజాంశాలు ద్వారా పునరుత్పత్తి చేసుకుంటాయి. ఇవి నాచు ఆధారంగా పెరిగిన మొక్కలు. వీటిలో గోల్డెన్‌ ఫెర్న్‌ చక్కగా ఉంటుంది. పది డిగ్రీల నుంచి 22 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య ఈ మొక్కలు బాగా పెరుగుతాయి. మొక్కల అడుగు భాగంలో ఎప్పుడూ నీటిచెమ్మ ఉండేలా చూసుకోవాలి. నేల కుండీల్లోనూ, వేలాడే కుండీల్లోనూ వీటిని పెంచుకోవచ్చు. వీటినీ చాలా ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. కాస్త విష స్వభావం ఉన్న వీటిని నేరుగా ఉపయోగిస్తే ప్రమాదం.

singoniam

                                                             

                                                               సింగోనియం
పత్ర సౌందర్యమున్న మరో మొక్క సింగోనియం. దీని ఆకులు హృదయాకారంగా ఉంటాయి. వీటిలో లేత ఆకుపచ్చ, బూడిద రంగు, సిల్వర్‌, పింకు, తెలుపు, లేత పసుపు రంగుల్లో ఆకులుండే మొక్కలున్నాయి.

jed

                                                               

                                                                            జేడ్‌
'లవ్లీ ప్లాంట్‌' అని ముద్దుగా పిలుచుకునే మొక్క జేడ్‌. చిన్నచిన్న ఆకులతో మొక్క నిండుగా, దళసరిగా ఉంటుంది. దీన్ని ఔషధాల్లోనూ ఉపయోగిస్తారు. కుండీల్లో మట్టి ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. నాలుగు రోజులకొకసారి కొద్దిగా నీళ్లుపోస్తే సరిపోతుంది. ఈ మొక్కను బహుమతిగానూ ఇస్తుంటారు. ఇది కాస్త ఖరీదైన మొక్క. వేలల్లో ధర పలుకుతుంది.
                                                     

pittonia

                                                                ఫిట్టోనియా ఆల్బివెనిస్‌
చిన్నచిన్న ఆకుపచ్చ ఆకుల మీద, తెల్లని చారల డిజైన్‌ ఉండే సుందరమైన మొక్క ఫిట్టోనియా ఆల్బివెనిస్‌. దీన్ని 'ఆర్నమెంటల్‌ మింట్‌' అనీ పిలుస్తారు. దీనికి తక్కువగా నీళ్లు పోయాలి. చీకటి గదిలో మరింత మెరుస్తూ ఉంటుంది.

- చిలుకూరి శ్రీనివాసరావు,
8985945506