Dec 05,2021 18:10

ప్రజాశక్తి-కడప అర్బన్ : యోగి వేమన యూనివర్శిటీ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి అల్పాహారం మానేసి మెస్ బిల్లు తగ్గించాలని నిరసన చేపట్టారు. విద్యార్థుల ధర్నా కు ఎస్ ఎఫ్ ఐ సంపూర్ణ మద్దతు ఇచ్చి విసితో ఫోన్ లో మాట్లాడారు. తక్షణమే విద్యార్థులు ధర్నా దగ్గరకి చేరుకొని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.ఆర్.నాయక్ డిమాండ్ చేశారు. తక్షణమే విసి సూర్య కళావతి ధర్నా దగ్గరికి చేరుకుని విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు కలిసి విసికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ యూనివర్శిటీలో లేని,రాని వంటి మెస్ బిల్లులు వైవీయూలొనే ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. మిగితా యూనివర్సిటీలతో పోలిస్తే వైవియులోనే మెస్ బిల్లు అధికంగా ఉన్న అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. మెస్ బిల్లు రూ. 3వేలను తగ్గించాలని డిమాండ్ చేశారు. గది అద్దె గతంలో రూ.150 ఉంటే నేడు రూ.250 చేసి విద్యార్థుల పై భారాలు వేయడం సరైనది కాదని తెలిపారు. గతంలో హాస్టల్ అభివృద్ధి ఫీజులు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.3000 లోపు ఉంటే నేడు రూ.5000, బి సి, ఓ సి మిగతా విద్యార్థులకు రూ.5000 గతంలో ఉంటే నేడు రూ.7000 చేసి విద్యార్థుల తల్లిదండ్రులపై భారాలు వేసి ఉన్నత విద్యను దూరం చేయడం బాధాకరమన్నారు. ఇది ప్రభుత్వ యూనివర్సిటీనా లేక ప్రవేయిట్ యూనివర్సిటీనా అని ప్రశ్నించారు. విద్యార్థులకు 24గంటలు అందుబాటులో గ్రంధాలయం ఉండాలని, స్టూడెంట్ స్టడీ హాల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.