Nov 04,2020 18:25

అరకోటి జనాభాగల, చాలా చిన్నదేశమైన న్యూజిలాండ్‌ వైవిధ్యభరిత నాయకత్వంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. న్యూజిలాండ్‌ ప్రధానమంత్రిగా రెండోసారి ఎన్నికైన జెసిండా ఆర్డరన్స్‌ ఇటీవలే మంత్రివర్గ విస్తరణ చేశారు. 2017లో తొలిసారి ఎన్నికైనప్పటి నుంచి పరిపాలనలో వినూత్న పంథాను కొనసాగిస్తూ వచ్చిన జెసిండా తాజా మంత్రివర్గ విస్తరణలో కూడా నూతనపంథాను కొనసాగించారు. యువతకు ప్రాధాన్యత ఇస్తూనే తొలిసారి ఒక ఆదివాసీ మహిళకు విదేశాంగ శాఖ పగ్గాలు అప్పజెప్పారు. అలాగే సమాజంలో నిత్యం అవమానాలు భరిస్తూ, నిందలు పడే 'గే' కమ్యూనిటీ వ్యక్తికి ఉప ప్రధాని పదవిని ఇచ్చారు. కేరళ మూలాలు ఉన్న భారతసంతతి మహిళకు తొలిసారి మంత్రివర్గ బాధ్యతలు అప్పగించారు.
సగానికి పైగా మహిళలే
ప్రస్తుతం నియమితులైన మొత్తం చట్టసభ్యులు 120 మంది. వారిలో సగానికి పైగా మహిళలు. ఇది ప్రపంచ సగటు 25 శాతం కంటే ఎక్కువ. అలాగే పార్లమెంటులో పది శాతం ఎల్‌జిబిటిక్యూ కమ్యూనిటీలకు కేటాయించారు. ఈ కేటాయింపుతో 7 శాతం 'హౌస్‌ ఆఫ్‌ గే' సభ్యులు గల యునైటెడ్‌ కింగ్‌డమ్‌ పార్లమెంటు చరిత్రను తిరగరాసినట్లైంది. మావోరి తెగ నుంచి 16 మంది ఎంపీలు, పసిఫిక్‌ ద్వీప మూలాలు, ఆఫ్రికన్‌ సంతతికి చెందిన వారు కూడా మంత్రివర్గంలో ఉన్నారు. ఇక ఈ నూతన మంత్రివర్గంలో అందరికీ ప్రాధాన్యత వహించే ఉపప్రధాని పదవికి ఎన్నికైన గ్రాంట్‌ రాబర్ట్‌సన్‌ 'గే' కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. 'గే' అని ఆయనే స్వయంగా ప్రకటించుకున్నాడు. ఇన్ని వైరుధ్యాలు గల వ్యక్తులతో కొలువైన న్యూజిలాండ్‌ పార్లమెంటు ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యమైనదిగా ఉండబోతోంది.
ఆదివాసీ తెగకు ప్రాతినిథ్య పదవి
మావోరి తెగకు చెందిన నైనియా మహుతా తొలిసారి 1996లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2016లో పార్లమెంటుకు హాజరైనప్పుడు ఆమె మావోరి సాంప్రదాయ టాటూ(మోకో)ను ధరించి వచ్చారు. ముఖం మీద పచ్చబట్టుతో పార్లమెంటుకు హాజరైన తొలి మహిళ ఆమె. ఈ 'మోకో' వారి పూర్వీకుల చరిత్రను తెలుపుతుంది. దీన్ని మావోరి తెగ ఎంతో పవిత్రంగా భావిస్తుంది. ఇప్పుడు మహుతా ఎన్నికతో ఆ పచ్చబట్టు అంతర్జాతీయ వేదికలపై తన జాతికి ఉన్నత గుర్తింపును తెచ్చిపెట్టడానికి సిద్ధమైంది. తొలిసారి 'మోకో'తో పార్లమెంటుకు హాజరైనప్పుడు 'మోకో ఒక పాస్‌పోర్ట్‌ లాంటిది. దీని వల్ల నేను ఎవరినో... నేను ఏ స్థానంలో ఉన్నానో.... ప్రపంచానికి చెబుతుంది' అని మహుతా చెప్పారు. 'దైనందిన వృత్తిలో అవకాశాల లేమితో సతమతమయ్యే ఎందరో మావోరి మహిళలు న్యూజిలాండ్‌ జనంతో మమేకమై ఉన్నారు. ఇప్పుడు ఈ ఎంపిక వారిలో కొత్త ఆశలను చిగురిస్తుంది' అని సోమవారం మంత్రిగా ప్రకటించిన తరువాత ఇచ్చిన ఇంటర్వ్యూలో మహుతా అన్నారు. 'మావోరి కింగ్‌' ఉద్యమానికి 160 ఏళ్ల చరిత్ర ఉంది. న్యూజిలాండ్‌ జనాభాలో మావోరి తెగ జనాభా 16 శాతం స్థానాన్ని ఆక్రమించింది. మంత్రిగా మావోరి అభివృద్ధిలో నైనియా మహుతా క్రియాశీలకంగా పనిచేశారు. 'ఇక్కడ ఆమె నిర్వహించాల్సిన పనులు మాత్రమే చూడాలి. ప్రపంచ వేదికలపై న్యూజిలాండ్‌ ప్రతినిధిగా నిలబడిన ఆమెను మహిళ అని, ఓ ఆదివాసీ తెగకు చెందిన స్త్రీ అని చూడడం ఆమె కార్యదీక్షతను అవమానించడమే' అంటారు ఒక ఇంటర్వ్యూలో జెసిండా.

వైవిధ్యభరిత కూర్పు
 

'గే'కు ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు?
ఇక న్యూజిలాండ్‌ కొత్త ఉప ప్రధానిగా ఎన్నికైన గ్రాంట్‌ రాబర్ట్‌సన్‌ 'గే' కమ్యూనిటీ వ్యక్తి. ఆర్థిక, మౌలిక విభాగాల మంత్రిగా సుదీర్ఘకాలం నుంచి రాబర్ట్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 'న్యూజిలాండ్‌ వాసులందరికీ మంత్రిగా ఒక 'గే'ను ఎందుకు ఎన్నుకున్నారు?' అని జెసిండాను ప్రశ్నించినప్పుడు 'ఇక్కడ రాబర్ట్‌ నాయకత్వ లక్షణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. అతను ఎలా గుర్తింబడుతున్నాడో అన్నది అనవసరం. పైగా న్యూజిలాండ్‌లో అటువంటి విషయాలు చాలా స్వల్పంగా తీసుకుంటారు' అంటారు ఆమె. కేరళ మూలాలు ఉన్న భారత సంతతి మహిళ ప్రియాంక రాధాకృష్ణన్‌ నాయకత్వ లక్షణాలపై ఉన్న గట్టి నమ్మకంతోనే తొలిసారి ఆమెను మంత్రివర్గంలోకి తీసుకున్నారు జెసిండా. నూతన మంత్రివర్గం శుక్రవారం ప్రమాణస్వీకరాం చేయబోతోంది.
కరోనా కట్టడిలో కేరళపై ప్రశంసలు
కరోనాను కట్టడిచేయడంలో ప్రపంచ దేశాలతో పోటీపడి అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకున్న కేరళపై జెసిండా అనేకసార్లు ప్రశంసలు కురిపించారు. కరోనా కట్టడిలో తాము సాధించిన ఘనతపై 'పరిపాలనా దక్షతతో పాటు ప్రజల సహకారం మరువలేని'దని కేరళ ఆరోగ్య మంత్రి శైలజా టీచర్‌, న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ప్రకటించడం ఉన్నతమైన వారి వ్యక్తిత్వానికి నిదర్శనం. కరోనాను ఎదుర్కోవడంలో న్యూజిలాండ్‌ గొప్ప ఘనతను సాధించింది. కేవలం 25 మరణాలతో కరోనాను కట్టడి చేయగలిగింది.