Apr 14,2021 13:08

వాషింగ్టన్‌ : అమెరికాలోని ఇండో - అమెరికన్లు, దక్షిణ, ఆగేయ ఆసియన్లకు వైశాఖి పండుగ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వారికి శుభాకాంక్షలు తెలిపారు. వైశాఖి పండుగ అంటే.. ఉగాది పండుగలాగానే.. నూతన సంవత్సరం ఆరంభంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ సందర్భంగా కేవలం జో బైడెన్‌ మాత్రమే కాకుండా.. ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌ కూడా వారికి శుభాకాంక్షలు తెలిపారు. 'హ్యాపీ బెంగాలీ, కంబోడియన్‌, లావో, మయన్మారీస్‌, నేపాలీ, సింహళీస్‌, తమిళ్‌, థారు.. విష్యూ న్యూ ఇయర్‌' అని ట్వీట్‌ చేసి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. అలాగే 'న్యూజెర్సీలోనూ.. ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగ జరుపుకునే వారందరికీ వైశాఖి శుభాకాంక్షలు' అని కాంగ్రెస్‌ సభ్యుడు ఫ్రాంక్‌ పల్లోన్‌ అన్నారు.
దేశవ్యాప్తంగా జరుపుకునే వైశాఖి పండుగ సందర్భంగా 'సిక్కు సమాజం వైశాఖిని సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను' అంటూ ఇండో అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు అమీ బేరా అన్నారు. మరో ఇండియన్‌ - అమెరికన్‌ చట్ట సభ్యుడు అయిన రో ఖన్నా కూడా సిక్కు కమ్యూనిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఇక సెనేటర్‌ డిక్‌ డర్బిన్‌ కూడా వారికి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ.. ట్వీట్‌ చేశారు.