Jun 13,2021 16:37

విశాఖపట్నం : కరోనా మహమ్మారి కారణంగా సినిమా రంగం డీలా పడిపోయిన సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు షూటింగ్‌లు ఆగిపోయాయి.. సినిమా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు చాలా నష్టాలు చవిచూశారు. కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో 50 శాతం, ఆ తరువాత పూర్తి సీటింగ్‌తో థియేటర్లు ఓపెన్‌ చేసుకోవచ్చని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో మళ్లీ థియేటర్లలో సందడి మొదలైంది. అయితే, కొన్ని నెలలకే కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభించడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. థియేటర్లన్నీ మూతపడ్డాయి. కాగా, ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్‌ వేవ్‌లో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ప్రభుత్వం కర్ఫ్యూను సడలిస్తూ పోతోంది. ఈ క్రమంలో సినిమా థియేటర్లు తెరవాల? వద్దా? అని డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ ఆలోచనలో పడ్డారు. అయితే, వైజాగ్‌లోని జగదాంబ థియేటర్‌ యజమాని మాత్రం ఓ అడుగు ముందుకేసి యాబై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్‌ను ఆదివారం ఓపెన్‌ చేశారు. ఈ ఏడాది విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రాల్లో ఒకటైన గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రవితేజ నటించిన 'క్రాక్‌' చిత్రాన్ని ప్రదర్శించారు. జగదాంబ థియేటర్‌ రీఓపెన్‌ కావడంతో వైజాగ్‌తో పాటు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా థియేటర్లు ఓపెన్‌ చేస్తారేమో చూడాలి. కరోనా వ్యాప్తి విషయాన్ని పక్కన పెడితే.. కొంత కాలంగా సెల్‌ఫోన్‌లోనే సినిమాలు చూస్తూ వచ్చిన సినీ ప్రియలు బిగ్‌స్క్రీన్‌ మీద సినిమా చూసేందుకు ఆసక్తి ఉన్నట్టున్నారు.