Jun 11,2021 12:20

ప్రజాశక్తి-కంటోన్మెంట్‌ (విజయనగరం) : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నూతనంగా తయారుచేసి జులై నెల నుండి అమల్లోకి తేనున్న వైఎస్‌ఆర్‌ బీమా పథకంలో కీలకమైన మార్పులు చేయాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో భీశెట్టి విలేకరులతో మాట్లాడుతూ... వైఎస్‌ఆర్‌ బీమా పథకం నిర్వహణపై బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించి క్లైముల పరిష్కారంలో ఏర్పడుతున్న చిక్కులకు స్వస్తి పలికారని అన్నారు. 18 నుండి 50 ఏళ్ల మధ్య వయసుండి సంపాదిస్తున్న వ్యక్తి సహజంగా మరణిస్తే ఆ కుటుంబాలకు ఒక లక్ష రూపాయలు, 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల సాయం అందిస్తామని ప్రకటించారని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో సంపాదించే వ్యక్తి అని కాకుండా కుటుంబంలో ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం కల్పించారని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మాత్రం కుటుంబంలోని సంపాదించే వ్యక్తి కే బీమా అని ప్రకటించడం వల్ల నిరు పేద కుటుంబాల ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని విమర్శించారు. ప్రభుత్వానికి ఆర్థిక భారం అనుకుంటే కనీసం దహన సంస్కారాలకి అయ్యే ఖర్చులు రూ.25 వేలు వెంటనే చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భీశెట్టి బాబ్జి డిమాండ్‌ చేశారు.

పాత క్లైముల సంగతి తేల్చండి !
వైఎస్‌ఆర్‌ బీమాకి అర్హులైన పేదలకు గత సంవత్సరం ఏప్రిల్‌ ఒకటి నుంచి అక్టోబర్‌ 21 వరకూ సంబంధించిన మరణాల బీమా క్లెయిమ్‌ రాష్ట్ర ప్రభుత్వం నేటివరకూ చెల్లింపులు చేయలేదని, దీనివలన రాష్ట్రంలో దాదాపు 3 నుండి 4 వేల కుటుంబాలకు తీరని నష్టం వాటిల్లిందని భీశెట్టి బాబ్జి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా వివిధ రాష్ట్రంలో లబ్ధిదారుల ఖాతాలకు రూ.95 వేల కోట్లు బదిలీ చేసిన ముఖ్యమంత్రికి పేద ప్రజలకు బీమా సౌకర్యం కల్పించడం, పాత క్లైములు పరిష్కరించడం పెద్ద సమస్య కాదని భీశెట్టి బాబ్జి పేర్కొన్నారు.