Oct 28,2021 19:57

సమావేశంలో మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ వేగుళ్ల

ప్రజాశక్తి - మండపేట
ఆప్తులను కోల్పోయి బాధపడుతున్న పేద లబ్ధిదారులకు వైఎస్‌ఆర్‌ బీమాను తక్షణం విడుదల చేయాలని ఎంఎల్‌ఎ వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక టిడిపి కార్యలయంలో కపిలేశ్వరపురం మండల పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో చంద్రన్న బీమా పథకంలో 50 ఏళ్లలోపు వారు చనిపోతే తక్షణమే వారి కుటుంబ సభ్యులకు మట్టి ఖర్చులుగా రూ.5 వేలు అందించామన్నారు. మిగిలిన రూ.1.95 లక్షలను 15 రోజుల్లో ఇచ్చేవారమన్నారు. 50 ఏళ్లు దాటిన వారు మరణిస్తే రూ.30 వేలు బీమాగా అందించేవారమని తెలిపారు. వైసిపి ప్రభుత్వం 50 ఏళ్లలోపు వారు చనిపోతే రూ.లక్ష మాత్రమే ఇస్తామని జిఒ తీసుకురావడం దారుణమన్నారు. నియోజకవర్గంలో రాయవరం 148, మండపేట 108, కపిలేశ్వరపురం 60, పట్టణంలో 117 మొత్తం 433 మందికి వైఎస్‌ఆర్‌ బీమా పెండింగ్‌లో ఉందన్నారు. పేదవారు ఆప్తులను కోల్పోయి ఉంటే వారికి ఇవ్వాల్సిన బీమా సొమ్ములు ఇవ్వకపోడం బాధాకరమన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.