
లక్నో : ప్రభుత్వాసుపత్రి లోపల ఓ వీధికుక్క బాలిక మృతదేహాన్ని నాకుతూ కనిపించిన వీడియో విమర్శలకు తావిస్తోంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ సింబాల్ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. బాలిక ఆసుపత్రికి రాకముందే చనిపోయిందా? లేక ఆస్పత్రిలో చేరిన తరువాత చనిపోయిందా? అనేదానిపై స్పష్టమైన సమాచారం లేదు. అయితే బాలిక మృతదేహం స్ట్రెచర్‌పై ఉంచి, తెల్లని వస్త్రం కప్పగా.. ఓ వీధికుక్క ఆ మృతదేహాన్ని నాకుతూ ఉన్నా.. విధుల్లో ఉన్న వార్డ్బారు, స్వీపర్ గమనించలేదని, ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆసుపత్రి ఛీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆసుపత్రి లోపల కుక్కల భయం ఉందని, వారు అంతకుముందే స్థానిక పౌర అధికారులకు లేఖ ద్వారా తెలియజేశామని. కానీ వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. కాగా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వార్డ్ బారును, స్వీపర్‌ను బాధ్యతల నుంచి తొలగించామని ఆసుపత్రి అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు కమిటీని వేశామని అన్నారు. అలాగే అత్యవసర విధుల్లో ఉన్న వైద్యుడి నుండి దర్యాప్తు కమిటీ వివరణ కోరింది. ఇటువంటి భయానక దృశ్యాన్ని సమాజ్‌వాదీపార్టీ సభ్యులే నెట్టింట్లో వీడియోను పోస్ట్ చేశారు. ఆ పార్టీ కూడా బాధ్యులను కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరింది.