Apr 14,2021 10:38

రాంచీ (జార్ఖండ్‌) : వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కరోనా ట్రీట్‌మెంట్‌ అందక తండ్రి మరణించాడు. తండ్రి మరణంతో మహిళ రోదన మిన్నంటింది. కన్నీటితో తల్లడిల్లిపోయింది. ఈ హృదయవిదారక ఘటన ... జార్ఖండ్‌ రాంచీలోని సదార్‌ హాస్పిటల్‌లో చోటుచేసుకుంది. ఓ మహిళ తన తండ్రిని కరోనా ట్రీట్‌మెంట్‌ కోసం ఆసుపత్రికి తీసుకొచ్చింది. అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉంది. కానీ అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. వెయిట్‌ చేయండి.. అంటూ.. ఆమెకు సమాధానమిచ్చారు. దీంతో ఆమె చాలాసేపు ఎదురుచూసింది. అప్పుడు వైద్య సిబ్బంది మాత్రం అక్కడే ఉన్న ఆరోగ్యశాఖ మంత్రి బన్నేస్‌ గుప్తాతో బిజీగా ఉన్నారు. పేషెంట్‌ను ఎవ్వరూ పట్టించుకోలేదు. డాక్టర్లు రావాలి అంటూ.. ఆ మహిళ చాలాసేపు మొరపెట్టుకుంది. తీరిగ్గా గంటసేపటి తరువాత వచ్చిన వైద్యులు వాళ్ల నాన్న చనిపోయాడు అని చెప్పడంతో ఆమె రోదన మిన్నంటింది. తండ్రి మరణానికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ మహిళ కన్నీటిపర్యంతమయింది.