
న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్... మరో కీలకమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. గ్రూపు చాట్స్, అలర్ట్స్ తో విసిగిపోయిన వినియోగదార్లకు తాజాగా అందించిన కొత్త అప్ డేట్ ఊరటనిస్తుందని అంటున్నారు. వాట్సాప్‌లోని గ్రూప్ చాట్లను ఆల్వేస్ మ్యూట్ అనే ఆప్షన్ తో ఎప్పటికీ మ్యూట్ చేసే ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని వాట్సాప్ తన అధికారిక ట్విటర్ లో వెల్లడించింది. చాట్‌ను ఎప్పటికీ మ్యూట్ చేయవచ్చని ట్వీట్ చేసింది. వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నఈ ఫీచర్‌ను ఎట్టకేలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా ఇది అందుబాటులో ఉంది. ఈ క్రొత్త ఫీచర్ వల్ల ఇబ్బందికరమైన వాట్సాప్ గ్రూపుల నుంచి ఎప్పటికీ, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. చాట్‌ను మ్యూట్ చేస్తే సంబంధిత గ్రూపుల నుంచి నోటిఫికేషన్ రాదు. సందేశాలు, చిత్రాలు లేదా వీడియోలు, ఇతర ఏ ఫీడ్ ఇబ్బంది పెట్టదు. అంతేకాదు. అవసరమైతే దీన్ని అన్‌మ్యూట్ చేసే అవకాశం కూడా ఉంది.
ఇటీవల మొబైల్ వెర్షన్‌కి మాత్రమే పరిమితమైన వీడియో/వాయిస్ కాల్ ఫీచర్‌ని వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్లో కూడా తీసుకొస్తున్నట్లు వెల్లడించిన విషయం విదితమే. ప్రస్తుతం బీటా వెర్షన్ వినియోగదార్లకు మాత్రమే అందుబాటులో వున్న ఈ ఫీచర్... త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తారని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ అయిన వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. వాట్సాప్ అప్డేట్ 2.2043.7 వెర్షన్లో ఈ కొత్త ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది. డెస్క్‌టాప్ వెర్షన్లో వీడియో కాల్ వచ్చినప్పుడు ప్రత్యేక విండోలో కాల్ యాక్సెప్ట్/రిజెక్ట్ చేసే ఆప్షన్ని చూపిస్తుంది. అలానే ఇతరులకు మనం కాల్ చేసినప్పడు కాల్ స్టేటస్ చూపిస్తూ పాప్-అప్ విండో ఓపెన్ అవుతుంది. దీని వల్ల వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్ ఎక్కువగా ఉపయోగించే వినియోగదారులు వాయిస్/వీడియో కాల్స్ కోసం మొబైల్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. అయితే, హెడ్సెట్, వెబ్‌క్యామ్ అవసరమవుతాయి. ఇంకా ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తుందనేది స్పష్టత లేదు.