Sep 19,2021 17:39

సదస్సులో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు

ప్రజాశక్తి - మంగళగిరి : సికె విద్యాసంస్థల పరిరక్షణకై ఉద్యమించాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ అంశంపై స్థానిక టిప్పర్ల బజార్లోని ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో సదస్సు ఆదివారం నిర్వహించారు. సదస్సుకు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ వీసం వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించి మాట్లాడారు. సికె విద్యాసంస్థలు స్వాతంత్య్రానికి పూర్వమే ఏర్పడిందని, ఈ ప్రాంతంలోని లక్షలాది మంది పేదలు చదివి ఉన్నత స్థానాలను అధిరోహించారని గుర్తు చేశారు. సిపిఎం పట్టణ కార్యదర్శి ఎస్‌ఎస్‌ చెంగయ్య మాట్లాడుతూ ఈ విద్యాసంస్థల రక్షణ కోసం పరోక్షంగా ఎంతోమంది మద్దతిస్తున్నారని చెప్పారు. సిపిఐ నాయకులు చిన్ని సత్యనారాయణ మాట్లాడుతూ మంగళగిరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చెందిన కుటుంబాలు ఎక్కువున్నారని, పేదలైన వీరి పిల్లలు ప్రైవేటు విద్యా సంస్థల్లో చదవాలంటే ఆర్థికంగా తీరని భారం అవుతుందని పేర్కొన్నారు. న్యాయవాది డివి నరసింహరావు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలు మంగళగిరి పట్టణంలో లేవని ఉన్న ఎయిడెడ్‌ సంస్థలను రద్దు చేస్తే ఇప్పటికే చదువుతున్న విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకం అవుతుందని చెప్పారు. సికె విద్యా సంస్థల సెక్రటరీ - కరస్పాండెంట్‌ జె.పాండురంగారావు మాట్లాడుతూ సికె విద్యా సంస్థల నిర్వహణలో అవకతవకలేమీ లేవని, సేవ దృక్పథంతోనే వీటిని నిర్వహిస్తున్నామని తెలిపారు. సిపిఎం తూర్పు గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జె.వి.రాఘవులు మాట్లాడుతూ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని, స్థానిక ప్రజా ప్రతినిధులు వాస్తవాలను గుర్తించకుండా నిందా ప్రచారాలు చేయడం దారుణమని, ఉన్నవాటిని కాపాడుకోవడంతోపాటు కొత్త విద్యా సంస్థలను నెలకొల్పాల్సి ఉంటే ఉన్నవాటినే ప్రైవేటీకరించడం ఏమిటని ప్రశ్నించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అద్యక్షులు ఎం.కిరణ్‌ మాట్లాడుతూ జీవో 42 వలన ఎయిడెడ్‌ విద్యాసంస్థలన్నీ ప్రైవేటుగా మారనున్నాయని, మరి ఆ ఆసంస్థల ఆస్తులు ఎవరికి ఇస్తారని, విద్యార్థులు, ఉపాధ్యాయుల పరిస్థితి ఏమీటని ప్రశ్నించారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థల రక్షణ కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. సదస్సులో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.మనోజ్‌, డివిజన్‌ కార్యదర్శి ఎం.బాలాజీ, నాయకులు ఎస్‌.గణేష్‌, టి.శ్రీరాములు, ఐ.నరసింహారావు పాల్గొన్నారు.