Nov 21,2020 07:34

సిడ్నీ : ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు, పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ దుబారు వేదికగా జరిగిన ఐపిఎల్‌ 2020 సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ అప్పట్లో మ్యాక్స్‌వెల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపిఎల్‌లో విఫలమైన మ్యాక్స్‌వెల్‌ను రూ.10 కోట్ల ఖరీదైన 'చీర్‌లీడర్‌' అని సెహ్వాగ్‌ ఎద్దేవా చేశాడు. ఈ కామెంట్‌పై మ్యాక్స్‌వెల్‌ తాజాగా స్పందించాడు. వార్తల్లో నిలవడం కోసమే అతడిలాంటి కామెంట్స్‌ చేశాడని తెలిపాడు. 'సెహ్వాగ్‌కు నా ఆటతీరు నచ్చకపోవడంతో బహిరంగంగా స్పందించాడు. ఆ అధికారం అతడికి ఉంది. వార్తల్లో నిలవడం కోసమే అతను ఆ వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకుంటా' అని మ్యాక్స్‌వెల్‌ అన్నాడు. ఇటీవల కాలంలో సెహ్వాగ్‌ భారత ఆటగాళ్ల ఆటతీరుపై తన కామెంట్స్‌ను సోషల్‌మీడియా వేదికగా బహిరంగంగా వెలిబుచ్చుతున్న సంగతి తెలిసిందే. అయితే అతడి కామెంట్స్‌పై దాదాపు ఎవరూ పట్టించుకునేవారు కాదు. తాజాగా మ్యాక్స్‌వెల్‌ స్పందించి రీకామెంట్‌ చేశాడు. మరి మ్యాక్స్‌వెల్‌ సమాధానానికి సెహ్వాగ్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడో చూడాలి.