Nov 26,2020 21:08

శ్రీకాకుళంలో భారీ ప్రదర్శనగా వెళ్తున్న కార్మికులు, ఉద్యోగులు, తదితరులు

ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: ఒక పక్కన జోరుగా కురుస్తున్న వర్షం. మరో పక్కన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలన్న సంకల్పం. వారి ఆకాంక్ష ఫలించింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. సమ్మె విజయవంతానికి సమస్త కార్మిక లోకం కదిలింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేలాది మంది కార్మికులు రోడ్డెక్కారు. కొందరు గొడుగులు చేతపట్టి ర్యాలీని అనుసరించగా, మరికొందరు వర్షంలో తడుస్తూనే ప్రదర్శనలో అడుగులో అడుగు వేసుకుంటూ కదిలారు. వేల గొంతుకలు ఒక్కటై నినాదాలతో హోరెత్తించారు. ఐకమత్యంతో సమ్మెను జయప్రదం చేయడం ద్వారా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి హెచ్చరికను పంపారు.
కార్మికుల సమ్మెతో పారిశ్రామికరంగం స్తంభించిపోయింది. కార్మికులు విధులకు వెళ్లకపోవడంతో పరిశ్రమలు బోసిపోయాయి. అరబిందో పరిశ్రమ నుంచి జ్యూట్‌ పరిశ్రమల వరకు అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో ఆర్థిక లావాదేవీలకు ఆటంకం కలిగింది. బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసి, పోస్టల్‌ ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో పౌర సేవలపై ప్రభావం పడింది. సమ్మె సందర్భంగా శ్రీకాకుళం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక డైమండ్‌ పార్కు వద్దకు ఉదయం తొమ్మిది గంటలకే కార్మికులు, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, కాంట్రాక్టు, అవుట్‌సోర్స్‌ిం ఉద్యోగులు, మెడికల్‌ రిప్రజెంటేటివ్‌లు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. వారికి సంఘీభావంగా ఉద్యోగులు, ఉపాధ్యాయలు, ఎన్‌జిఒలు వచ్చారు. వీరంతా ఎర్రజెండాలను చేతబూని ర్యాలీగా బయలుదేరారు. మోడీ ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ, రైతు వ్యతిరేక విధానాలు నశించాలి, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ ఆపాలంటూ ర్యాలీ పొడవునా పెద్దపెట్టున నినాదాలు చేశారు. జిటి రోడ్డు, ఏడురోడ్ల కూడలి, కళింగరోడ్డు, పాతబస్టాండ్‌ మీదుగా ఎన్‌జిఒ హోంకు ర్యాలీ చేరుకుంది. అనంతరం మారుతి థియేటర్‌ ఆవరణలో సిఐటియు నాయకులు టి.తిరుపతిరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతోందని విమర్శించారు. మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని బహుళజాతి కంపెనీలకు అమ్మేస్తోందని చెప్పారు. కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయిన కార్మికులు, వలస కార్మికులను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీలకు రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిందన్నారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు మాట్లాడుతూ అన్ని రంగాల కార్మికులు రోడ్డు మీదకొచ్చి సమ్మెను విజయవంతం చేశారని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఇది ఒక చెంపపెట్టు అని హెచ్చరించారు. ఎన్‌జిఒ సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ కనీస వేతనాలు, పాత పెన్షన్‌ విధానం అమలు, అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు వ్యవస్థల రద్దు మాటలకే పరిమితమైందని విమర్శించారు. ఎఐటియుసి నాయకులు చిక్కాల గోవిందరావు మాట్లాడుతూ కార్మికులే బిజెపి ప్రభుత్వానికి ఘోరీ కడతారని హెచ్చరించారు. ఐఎఫ్‌టియు నాయకులు ఎన్‌.నీలంరాజు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు.
సిపిఎం, సిపిఐ, సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శులు భవిరి కృష్ణమూర్తి, సనపల నర్సింహులు, తాండ్ర ప్రకాష్‌ సమ్మెకు మద్దతు పలికారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఆర్‌.సురేష్‌బాబు, పి.తేజేశ్వరరావు, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చౌదరి రవీంద్ర, పలు సంఘాల నాయకులు కె.కళ్యాణి, డి.వి.టి రాజు, సిహెచ్‌.లక్ష్మి, ఎం.ఆదినారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన తపాలా కార్యాలయం వద్ద తపాలాశాఖ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో తపాలా ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి కె.గణపతి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటీకరించవద్దని, బ్యాంకు ఉద్యోగులకు ఎన్‌పిఎస్‌ను రద్దు చేయాలని జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం ప్రధాన కార్యదర్శి బి.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. సమ్మెలో బ్యాంకు ఉద్యోగుల సంఘ నాయకులు పాల్గొన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం నుంచి డైమండ్‌ పార్కు వరకు ఆ సంస్థ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బిఎస్‌ఎన్‌ఎల్‌ ఇయు జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ఎం.కసవయ్య, పి.వెంకటరమణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.గోవర్థనరావు తదితరులు పాల్గొన్నారు.
రణస్థలం మండలంలోని పైడిభీమవరం పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులు, అంగన్వాడీలు, ఆశావర్కర్లు, మధ్యాహ్న భోజన పథం కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో భాగస్వామయ్యాయరు. పైడిభీమవరంలో సిఐటియు ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, వెలమల రమణ, పలు పరిశ్రమల యూనియన్ల నాయకులు తదితరులు పాల్గొన్నారు. బూర్జ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రదర్శనలో సిఐటియు మండల కన్వీనర్‌ బి.ఎస్‌ రాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కె.అప్పలనాయుడు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. మెళియాపుట్టి మండల కేంద్రంలోని మూడు రోడ్ల కూడలిలో
అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, కళాసీలు తదితరులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌ ప్రసాదరావుకు వినతిపత్రం అందించారు.
వంగర వంగర బస్టాండ్‌ నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో సిఐటియు మండల కన్వీనర్‌ యజ్జల అప్పలస్వామి, రూపావతి, రూప, భారతి, చినతల్లి, ఆదినారాయణ, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఆమదాలవలస పట్టణంలో రైల్వేస్టేషన్‌ నుంచి వన్‌వే ట్రాఫిక్‌ కూడలి వద్ద గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.నాగమణి, పంచాది కృష్ణ, పలు యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. వైఎస్‌ఆర్‌ కూడలి వద్ద నిర్వహించిన ర్యాలీలో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌.అప్పలనాయుడు, పి.లక్ష్మీనారాయణ, ఐలు జిల్లా గౌరవాధ్యక్షులు బి.మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
రాజాం పట్టణంలోని సిఐటియు కార్యాలయం నుంచి పాలకొండ రోడ్డు వరకు ర్యాలీ అనంతరం అంబేద్కర్‌ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్‌.రామ్మూర్తి నాయుడు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. డోలపేట చెక్‌పోస్టు నుంచి అంబేద్కర్‌ జంక్షన్‌ వరకు ప్రయివేటు ఉపాధ్యాయులు ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం జంక్షన్‌ వద్ద మానవహారం చేపట్టి, మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. కార్యక్రమంలో ప్రయివేటు ఉపాధ్యాయుల సంఘం నాయకులు కె.మోహనరావు, కె.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
లావేరు జంక్షన్‌ నుండి సచివాలయం వరకు సిఐటియు ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.వి రమణ, ఎం.గౌరీశంకర్‌, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. రేగిడి మండలం ఉంగరాడమెట్ట వద్ద మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి త్రినాథ్‌, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.
సీతంపేటలోని సిఐటియు కార్యాలయం నుంచి సంత మార్కెట్‌ వరకు అంగన్వాడీలు, ఆశావర్కర్లు, పారిశుధ్య కార్మికులు తదితరులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్‌ వద్ద మానవహారం చేపట్టి నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం.తిరుపతిరావు, మండల కార్యదర్శి భాస్కరరావు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
భామినిలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్‌, సిఐటియు, భవన నిర్మాణ తదితరులు పాల్గొన్నారు.
వీరఘట్టం మండలం నడుకూరు నుంచి అంబేద్కర్‌ జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్‌ బి.వాసుదేవరావు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
పాలకొండ ఆర్‌టిసి కాంప్లెక్స్‌ ఆవరణలో భారీ ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి దావాల రమణారావు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కొత్తూరు స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో వ్య.కా.స నాయకులు గంగరాపు సింహాచలం, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
టెక్కలిలో సిఐటియు ఆధ్వర్యాన భవన నిర్మాణ, రిక్షా, రైస్‌ మిల్లు, గ్రానైట్‌, తదితర కార్మికులు పంచాయతీ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎన్‌.షణ్ముఖరావు, లక్ష్మణరావు, డి.సూర్యనారాయణ, ధర్మారావు, తదితరులు పాల్గొన్నారు.
పోలాకి తహశీల్దార్‌ కార్యాలయం నుంచి ఎంపిడిఒ కార్యాలం వరకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ఆర్‌.చిన్నమ్మడు, కె.నరసింహ, సరోజనమ్మ, అమరావతి, తోట రాజు, తదితరులు పాల్గొన్నారు.
నరసన్నపేట ఎంపిడిఒ కార్యాలయం నుంచి కళాసీ భవనం వరకు సిఐటియు ఆధ్వర్యాన కార్మికులు, ఎల్‌ఐసి ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వై.చలపతిరావు, నాయకులు రాధాకాంతమ్మ, జగదీశ్వరి, రమేష్‌, రాము, మోహనరావు, పాల్గొన్నారు.
సారవకోటలో సిఐటియు ఆధ్వర్యాన కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో మహాలక్ష్మి, సరోజనమ్మ, అప్పయ్య, సింహాద్రి, జయ, తదితరులు పాల్గొన్నారు.
జలుమూరులో ఎంపిడిఒ కార్యాలయం నుంచి బస్టాండ్‌ వరకూ సిఐటియు ఆధ్వర్యాన కార్మికులు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు బైరి సిమ్మయ్య, దేవి, మాలతి, సరోజని, తదితరులు పాల్గొన్నారు.
పలాస ఆర్‌టిసి కాంప్లెక్స్‌ నుంచి సిఐటియు, ఎఐటియుసి, సిపిఎంఎల్‌ లిబరేషన్‌, సిపిఐ ఎంఎల్‌, తదితర కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు మహా ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శన శ్రీనివాస్‌ కూడలి, పాత బస్టాండ్‌ మీదుగా కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి వరకు సాగింది. కార్యక్రమంలో నాయకులు ఎన్‌.గణపతి, సిహెచ్‌ వేణుగోపాల్‌, రామారావు, సన్యాసిరావు, మాధవరావు, పి.దుర్యోధన, రాంబాబు, సునీత, తదితరులు పాల్గొన్నారు.
మందస బస్టాండ్‌ నుంచి స్థానిక జెడ్‌పి హైస్కూల్‌ వరకు సిఐటియు, కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు వి.వి.రమణమూర్తి, ఆర్‌.దిలీప్‌కుమార్‌, కేశవరావు, దేవేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
హరిపురంలో మార్పు పద్మనాభం, అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం మెయిన్‌ రోడ్డులో సిఐటియు ఆధ్వర్యాన కార్మికులు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు దిలీప్‌కుమార్‌, ఖగేశ్వరరావు, పి.పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.
నందిగాం రెవెన్యూ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. అనంతరం ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి.సాంబమూర్తి, ఆదిలక్ష్మి, రాజేశ్వరి, అన్నపూర్ణ పాల్గొన్నారు. కోటబొమ్మాళి రైతు బజారు నుంచి కొత్తపేట వరకు ర్యాలీ నిర్వహించారు. కొత్తపేట కూడలిలో సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్నభోజన పథకం, గ్రామ పంచాయతీ కార్మికులు, రిక్షా, రైసు మిల్లు, గ్రానైటు కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు ఎన్‌.షణ్ముఖరావు, సత్యమూర్తి, డి.సుదర్శన, జి.నీలన్న, రోణంకి, శ్రీనివాస్‌, టి.దుర్గారావు, బి.శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.
కంచిలిలో సిఐటియు, రైతు సంఘం ఆధ్వర్యాన మార్కెట్‌ కమిటీ నుంచి రైల్వే స్టేషన్‌ వరకు ర్యాలీ చేపట్టారు. మానవహారంగా ఏర్పడ్డారు. బూరగాంలో గ్రామ సచివాలయం వద్ద మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో కె.గోపీనాథ్‌, రాజు, వల్లభరావు, ఆశ, రైస్‌ మిల్లు, కొబ్బరి కార్మికులు పాల్గొన్నారు.
సోంపేట ప్రభుత్వ ఆస్పత్రి నుంచి గాంధీ మండపం వరకు సిఐటియు ఆధ్వర్యన ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్‌.లక్ష్మీనారాయణ, పి.చిరంజీవి, సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్ఛాపురంలో తహశీల్దార్‌ కార్యాలయం నుంచి మెయిన్‌రోడ్డు, దాసన్నపేట మార్కెట్‌ రోడ్డు మీదుగా బస్టాండ్‌ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మానవహారంగా ఏర్పడ్డారు. కార్యక్రమంలో నాయకులు అల్లు సత్యనారాయణ, గాంగాధర్‌ రౌలో, ఆర్‌.శ్రీను, పద్మజ, భాగ్యలక్ష్మి, ఆటో, అంగన్వాడీ, ఆశ, తదితరులు పాల్గొన్నారు.